చేయని నేరం మోపడంతో క్షణికావేశంలో..
పగిడ్యాల(కర్నూలు జిల్లా): ఏ నేరం చేయకున్నా తనపై దొంగతనాన్ని అంటగట్టడంతో ఓ వివాహిత మానసిక క్షోభకు గురైంది. క్షణికావేశంలో ఎవరూలేని సమయం చూసి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం పగిడ్యాల మండలం పడమర వనుములపాడు గ్రామంలో జరిగింది.
గ్రామానికి చెందిన విశ్వరూప ఆచారి, సావిత్రమ్మలు అమరవాయిలోని తన అక్క కొడుకు పెళ్లి వేడుకలకు 10 నెలల క్రితం వెళ్లి వచ్చారు. ఆ పెళ్లిలో 4 తులాల బంగారు ఆభరణం చోరీకి గురైంది. ఈ ఘటనలో తన భార్యను అనుమానించారని, బంగారు ఆభరణాల ఆచూకీ కోసం తరచూ తమ ఇంటికి పోలీసులు వచ్చి వేధించేవారని సావిత్రమ్మ భర్త తెలిపారు. అంతలోనే తన కూతురుకు పెళ్లి నిశ్చయం కావడంతో తమ శక్తి కొలది కట్నకానుకలు ఇచ్చి పెళ్లి చేశామని వివరించారు.
అయితే, దొంగిలించిన నగను కూతురు మెడలో వేసి పెళ్లి చేశామని, ఇందుకు వీడియో చిత్రాలు సాక్ష్యంగా ఉన్నాయంటూ నాలుగు రోజుల క్రితం పోలీసులు మానసికంగా వేధించడంతో తన భార్య అనారోగ్యానికి గురైందని ఆయన తెలిపారు. చేయని నేరానికి ఎందుకు కుమిలిపోతావ్.. గ్రామ పెద్దలు మనకు న్యాయం చేయకపోతారా? అని తాను ధైర్యం చెబుతూ వచ్చానని, ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం తాను ఇంట్లో లేని సమయంలో సావిత్రమ్మ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుందని ఆయన స్థానిక ఎస్సై చంద్రమోహన్‌కు తెలిపారు. చికిత్స నిమిత్తం సావిత్రమ్మను 108 వాహనంలో స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.