దామెర(ఎల్కతుర్తి, కరీంనగర్ జిల్లా): ఓ వివాహిత తనకు న్యాయం చేయాలని ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగిన సంఘటన మండలంలోని దామెరలో జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఐత స్వర్ణలతకు ఎల్కతుర్తికి చెందిన ఓ వ్యక్తితో నాలుగు నెలల క్రితం వివాహమైంది. అప్పటికే ఆమె దామెరకు చెందిన పాటి ప్రవీణ్‌ను ప్రేమించింది.
వివాహమైనా.. స్వర్ణలతతో ప్రవీణ్ వివాహేతర సంబంధం నెరుపుతున్నాడు. ఇద్దరు కలిసి ఉండగా.. స్వర్ణలత అత్తమామ గమనించి పోలీసులకు అప్పగించారు. స్వర్ణలత విడాకులు తీసుకుంటే వివాహం చేసుకుంటానని ప్రవీణ్ చెప్పడంతో పెద్దమనుషుల సమక్షంలో ఇటీవలే విడాకుల పత్రం రాయించారు. తీరా ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ బాధితురాలు ప్రవీణ్ ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది. తనకు న్యాయం జరిగేవరకు ఇక్కడే ఉంటానని తెలిపింది. అప్పటికే ప్రవీణ్ కుటుంబం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. ఎస్సై వెంకటరంగయ్యసూరి బాధితురాలితో మాట్లాడారు. ఫిర్యాదు చేస్తే న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ప్రియుడి ఇంటి ఎదుట వివాహిత బైఠాయింపు
Published Thu, Sep 22 2016 11:29 AM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM
Advertisement
Advertisement