సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ప్రభాకర్
సాక్షి, సంగారెడ్డి: దేశ ప్రధాని నరేంద్ర మోడీ జిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కోరారు. గురువారం సంగారెడ్డిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి నీళ్లు అందించారన్నారు.
నాటి స్పూర్తితో సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలందరికీ రక్షిత మంచినీటిని తాగించేందుకు మిషన్‌భగీరథ ప్రారంభించినట్లు చెప్పారు. ప్రజలకు మేలు చేసే పథకాన్ని ఈనెల 7న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభింపజేయనున్నట్లు తెలిపారు. గజ్వేల్ మండలం కోమటిబండలో ప్రధాని మోడీ 7న మిషన్‌భగీరథ ప్రారంభించి బహిరంగసభలో పాల్గొంటారని తెలిపారు.
ప్రధాని పర్యటను కోసం భారీగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రెండు లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి జనాలను సమీకరిస్తున్నట్లు చెపారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పదివేల మందిని ప్రదాని బహిరంగ సభకు తరలించనున్నట్లు తెలిపారు.
జనసమీకరణకు సంబంధించిన బాధ్యతలను మండల, పట్టణ టీఆర్‌ఎస్ నాయకులు అప్పగించినట్లు వివరించారు. ప్రజలను, టీఆర్‌ఎస్ కార్యకర్తలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులు, వాహనాలను సమకూర్చుతున్నట్లు తెలిపారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు శ్రీనివాస్‌చారి, హరికిషన్, బొంగుల రవి, జలాలుద్దీన్ బాబా, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.