mass mobilization
-
35 వేల బూత్‌ల నుంచి జన సమీకరణ!
సాక్షి, హైదరాబాద్: పార్టీ అతిరథ మహారథులు హాజరు కావడంతో పాటు రానున్న ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చే ఐదు గ్యారంటీ కార్డు స్కీంలను ప్రకటించే ‘విజయభేరి’పై కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. ఈ సభను విజయవంతం చేయడం ద్వారా ఉత్సాహంగా ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని భావిస్తోంది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనసమీకరణకు, తుక్కుగూడకు సమీపంలో ఉన్న మహబూబ్‌నగర్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లోని నియోజకవర్గాల ప్రజలను కూడా పెద్ద సంఖ్యలో తరలించేందుకు పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో టీపీసీసీ ముఖ్య నేతలు జూమ్ సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 11 నుంచి మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయాలని, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న 35 వేల బూత్‌ల నుంచి సభకు కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చేలా చూడాలని సూచించారు. సోమవారం పార్లమెంటు పరిశీలకులు, టీపీసీసీ ఉపా ద్యక్షు లతో సమీక్ష నిర్వహించాలని, ఆ తర్వాత 12, 13, 14 తేదీల్లో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి జనసమీకరణ కసరత్తును పకడ్బందీగా పూర్తి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. సమన్వయం చేసుకోండి: రేవంత్ విజయభేరి సభ విజయవంతం చేసే కార్యక్రమాన్ని పార్టీ నేతలతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సమన్వయం చేసుకోవాలని రేవంత్‌రెడ్డి సూచించారు. ఈనెల 17న సోనియాగాంధీ ఐదు గ్యారంటీ కార్డు స్కీంలను ప్రకటిస్తారని, సభ ముగిసిన వెంటనే కాంగ్రెస్ నేతలు నియోజకవర్గాలకు వెళ్లి ఇంటింటికీ ఈ గ్యారంటీ కార్డులను అందజేయాలని కోరారు. ఈనెల 18న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటింటికీ వెళ్లి ఈ స్కీంల గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు. -
భారీ జన సమీకరణ!
సాక్షి, హైదరాబాద్/మహబూబ్‌నగర్ న్యూటౌన్: ఎన్నికల శంఖారావ సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. మహబూబ్‌నగర్‌లో ఈనెల 15న నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హాజరు కానున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పార్టీ అభిమానులు, కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 1 నుంచే దీనికి సంబంధించిన కార్యాచరణను ప్రారంభించింది. ఇటీవల మంత్రాలయం పర్యటనకు వచ్చిన అమిత్‌షా.. పార్టీ నేతలతో సమావేశమైన సందర్భంగా మహబూబ్‌నగర్‌లో నిర్వహించే ఎన్నికల శంఖారావ సభలో పాల్గొంటానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఈనెల 15న సభ నిర్వహించేందుకు ఆమోదం తెలిపారు. తాను హాజరవుతానని, రాష్ట్రంలో స్వయంగా పార్టీ కోసం ప్రచారం చేస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో పార్టీ శ్రేణులు ఈనెల 4న మహబూబ్‌నగర్‌లో ప్రత్యేకంగా పార్టీ ఎన్నికల శంఖారావ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. అలాగే పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, తాజా మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తదితరులు ఇప్పటికే పలుమార్లు మహబూబ్‌నగర్‌కు వెళ్లి ఏర్పాట్లను సమీక్షించారు. తాజాగా సోమవారం కూడా సమావేశ ఏర్పాట్లపై జిల్లా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. అనంతరం మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. మార్పు కోరుకుంటున్న రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీల అమలులో టీఆర్ఎస్ ఘోరంగా విఫలమైందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రకటన జారీ చేసేంత వరకు అభ్యర్థులను ప్రకటించబోమని చెప్పారు. రాజకీయాల్లో అనిశ్చితి, గందరగోళం సృష్టించి లబ్ధిపొందాలని కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్, జోగుళాంబ, వనపర్తి, నాగర్‌కర్నూలు, నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పార్టీ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులను తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున ఎక్కువ మంది అభ్యర్థులను గెలిపించేందుకు అవసరమైన కార్యాచరణపైనా దృష్టి సారించారు. అమిత్‌షా రాష్ట్ర ఎన్నికలపై శ్రద్ధ చూపిస్తున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో పార్టీ నేతలను గెలిపించేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. పార్టీ వర్గాలు రెట్టించిన ఉత్సాహంతో పని చేసేలా కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. సొంతంగానే తాము పోటీ చేస్తామని చెబుతున్నా.. పొత్తులకు కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై, పొత్తులపై స్పష్టతను అమిత్‌షా మహబూబ్‌నగర్ సమావేశం సందర్భంగా ఇస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ నెల 11న రాష్ట్రంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ కూడా మంగళవారం పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. అలాగే పార్టీ మెనిఫెస్టో కమిటీ కూడా మంగళవారం సమావేశం కానుంది. -
ప్రధాని సభకు భారీగా జన సమీకరణ
సాక్షి, సంగారెడ్డి: దేశ ప్రధాని నరేంద్ర మోడీ జిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కోరారు. గురువారం సంగారెడ్డిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి నీళ్లు అందించారన్నారు. నాటి స్పూర్తితో సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలందరికీ రక్షిత మంచినీటిని తాగించేందుకు మిషన్‌భగీరథ ప్రారంభించినట్లు చెప్పారు. ప్రజలకు మేలు చేసే పథకాన్ని ఈనెల 7న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభింపజేయనున్నట్లు తెలిపారు. గజ్వేల్ మండలం కోమటిబండలో ప్రధాని మోడీ 7న మిషన్‌భగీరథ ప్రారంభించి బహిరంగసభలో పాల్గొంటారని తెలిపారు. ప్రధాని పర్యటను కోసం భారీగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రెండు లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి జనాలను సమీకరిస్తున్నట్లు చెపారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పదివేల మందిని ప్రదాని బహిరంగ సభకు తరలించనున్నట్లు తెలిపారు. జనసమీకరణకు సంబంధించిన బాధ్యతలను మండల, పట్టణ టీఆర్ఎస్ నాయకులు అప్పగించినట్లు వివరించారు. ప్రజలను, టీఆర్ఎస్ కార్యకర్తలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులు, వాహనాలను సమకూర్చుతున్నట్లు తెలిపారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌చారి, హరికిషన్, బొంగుల రవి, జలాలుద్దీన్ బాబా, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.