
సాక్షి, హైదరాబాద్: పార్టీ అతిరథ మహారథులు హాజరు కావడంతో పాటు రానున్న ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చే ఐదు గ్యారంటీ కార్డు స్కీంలను ప్రకటించే ‘విజయభేరి’పై కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. ఈ సభను విజయవంతం చేయడం ద్వారా ఉత్సాహంగా ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని భావిస్తోంది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనసమీకరణకు, తుక్కుగూడకు సమీపంలో ఉన్న మహబూబ్‌నగర్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లోని నియోజకవర్గాల ప్రజలను కూడా పెద్ద సంఖ్యలో తరలించేందుకు పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఇందులో భాగంగా ఆదివారం రాత్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో టీపీసీసీ ముఖ్య నేతలు జూమ్ సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 11 నుంచి మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయాలని, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న 35 వేల బూత్‌ల నుంచి సభకు కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చేలా చూడాలని సూచించారు.
సోమవారం పార్లమెంటు పరిశీలకులు, టీపీసీసీ ఉపా ద్యక్షు లతో సమీక్ష నిర్వహించాలని, ఆ తర్వాత 12, 13, 14 తేదీల్లో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి జనసమీకరణ కసరత్తును పకడ్బందీగా పూర్తి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
సమన్వయం చేసుకోండి: రేవంత్
విజయభేరి సభ విజయవంతం చేసే కార్యక్రమాన్ని పార్టీ నేతలతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సమన్వయం చేసుకోవాలని రేవంత్‌రెడ్డి సూచించారు. ఈనెల 17న సోనియాగాంధీ ఐదు గ్యారంటీ కార్డు స్కీంలను ప్రకటిస్తారని, సభ ముగిసిన వెంటనే కాంగ్రెస్ నేతలు నియోజకవర్గాలకు వెళ్లి ఇంటింటికీ ఈ గ్యారంటీ కార్డులను అందజేయాలని కోరారు. ఈనెల 18న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటింటికీ వెళ్లి ఈ స్కీంల గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు.