మావోయిస్టుల ఎజెండాయే మా ఎజెండా అని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నేడు ప్రజా ఉద్యమాలు, ప్రజలను హత్యలు చేయిస్తున్నారని మావోయిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి కిరణ్ ఆరోపించారు.
ఖమ్మం: మావోయిస్టుల ఎజెండాయే మా ఎజెండా అని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నేడు ప్రజా ఉద్యమాలు, ప్రజలను హత్యలు చేయిస్తున్నారని.. హక్కుల సంఘాల గొంతుకలను నొక్కుతున్నారని మావోయిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి కిరణ్ ఆరోపించారు. ఖమ్మం జిల్లా 'సాక్షి' కార్యాలయానికి బుధవారం పంపిన లేఖలో ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు.
ఏడాది దాటినా మావోయిస్టుల ఎజెండా ఎక్కడ అమల చేస్తున్నారని కిరణ్ లేఖలో ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పెట్టుబడిదార్ల తొత్తుగా మారి పోలవరం, కంతనపల్లి, ఇనుప గనుల తవ్వకాలు, మైనింగ్ మాఫియా, ఓపెన్‌కాస్ట్ గనులు, హైడల్ ప్రాజెక్టు, విద్యుత్‌ప్లాంట్ల నిర్మాణానికి పూనుకుంటూ విదేశీ పెట్టుబడులు, బహుళజాతి గుత్త సంస్థలకు ఎర్రతివాచీ పరచి స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో ఉస్మానియాలో విద్యార్థులను ఆందోళనకు గురిచేసేలా ప్రకటన చేసి గతంలో విద్యార్థులు చదువుకోవడానికి, ఉండటానికి కేటాయించిన భూములను ఆక్రమించుకో చూశారని ఆరోపించారు. విద్యార్థులకు పోలీసుల రుచిని చూపించాడని పేర్కొన్నారు.
భారతదేశ ప్రజల విముక్తి కోసం పీడిత ప్రజలను ఐక్యం చేసి ప్రజాయుద్ధాన్ని ముందుకు తీసుకుపోతున్న క్రమంలో పాలకుల కుట్రలు, కుతంత్రాలు, ప్రజాయుద్ధంలో నేలకొరిగిన అమరులను స్మరించుకుంటూ ఈనెల 28 నుంచి వచ్చేనెల 3 వరకు జరుగుతున్న అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను విజయవంతం చేయాలని కిరణ్ పిలుపునిచ్చారు.