సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రిని హతమార్చేందుకు మావోయిస్టులు కుట్రపన్నారనే ఆరోపణలతో కూడిన లేఖలో తన పేరు ప్రస్తావించడాన్ని విప్లవ రచయిత వరవరరావు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న వాళ్ల గొంతునొక్కేందుకే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కుట్ర కేసులు నమోదు చేస్తోందని పేర్కొన్నారు.
రాజకీయ ఖైదీల విడుదల కమిటీ కార్యదర్శి రోనావిల్సన్ వద్ద లభించినట్లు పేర్కొంటున్న లేఖలు అసంబద్ధమైనవన్నారు. మోదీ రాజకీయంగా తన ఇమేజ్ పడిపోయినప్పుడల్లా ఇలాంటి సంచలనాలతో ఇమేజ్‌ను పెంచుకుంటున్నట్లు ఆరోపించారు. గతంలో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడూ ఇదే తరహాలో ఇమేజ్ పెంచుకొనేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు.
ఆదివాసీలు, దళితుల హక్కుల కోసం గొంతెత్తినప్పుడల్లా ఎంతోమంది హక్కుల ఉద్యమకారులను, కార్యకర్తలను అరెస్టు చేసి జైళ్లలో పెట్టారని, ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా, సురేంద్ర గాడ్లే, అశోక్‌రావత్ తదితరులను ఇలాగే అరెస్టు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. నిరాధారమైన, తప్పుడు కుట్ర కేసుల ద్వారా ప్రజాస్వామిక హక్కులను అణచివేయడం, హక్కుల కార్యకర్తల గొంతులను నొక్కేయడం దారుణమని పేర్కొన్నారు. ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఇలాంటి దాడులను ఖండించాలని కోరారు.
ఇది కుట్ర పూరితం...
ప్రధానిమోదీని చంపేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారని ఒక లేఖను సృష్టించి, అందులో విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు పేరును ఇరికించారని విప్లవ రచయితల సంఘం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. భీమాకోరేగావ్‌లో అసలు నిందితులైన సంఘ్ పరివార్ నాయకులను వదిలేసి దళిత, హక్కుల సంఘాల నాయకుల్ని అరెస్టు చేశారని, దానికి కొనసాగింపుగా ఒక కుట్ర కేసును రచించడం ద్వారా ప్రజాసంఘాలను, దళిత ఉద్య మాలను, విప్లవ ప్రజాస్వామిక భావాల వ్యక్తీకరణ ను అణచివేయాలని చూస్తున్నారని విరసం కార్య దర్శి పాణి, సీనియర్ సభ్యులు కళ్యాణరావు, కార్యవర్గసభ్యులు వరలక్ష్మి, కాశిం, రాంకీ తదితరులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది నాగపూర్ కేంద్రంగా ఆరెస్సెస్, బీజేపీ శక్తులు రచించిన కుట్రగా వారు అభివర్ణించారు. ఇలాంటి కుట్ర రచనలు వారికి కొత్త కాదని, మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాగే జరిగిందని పేర్కొన్నారు. తమ పట్ల విశాల ప్రజారాశుల్లో వ్యతిరేకత ప్రబలుతున్నప్పుడు ప్రజల సానుభూతిని పొందేందుకు, ప్రధాన సమస్యలపై దృష్టి మళ్లించేందుకు, పనిలో పనిగా ఉద్యమించే శక్తులను, ప్రశ్నించే గొంతుల్ని అణచివేసేందుకు పాలకులు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
మోదీపై కుట్ర పెద్ద అబద్ధమని, అసలు కుట్ర మోదీ రాజ్యం చేస్తున్నదని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. దీని ద్వారా ప్రభుత్వం ఆశిస్తున్న ప్రయోజనాల్లో ఒక్కటి కూడా నెరవేరక పోగా మరింతగా అది అప్రతిష్ట మూటగట్టుకుంటుందన్నారు. ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించవలసిన ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు నిబద్ధులై అమలు చేస్తున్న విధానాల అసలు రూపు దాచేస్తే దాగదని, మతం పేరుతో, సంస్కృతి పేరుతో ప్రభుత్వం చేస్తున్న విన్యాసాలను, వికృత పోకడలను భీమా కోరేగావ్ మరోమారు అణగారిన ప్రజల ముందు పెట్టిందని పేర్కొన్నారు. దానిని సహించలేకే మోదీ ప్రభుత్వం ఫాసిజాన్ని అమలు చేస్తున్నదని, నాగపూర్ నుండి భీమా కోరేగావ్ మీదుగా హైదరాబాద్ దాకా ప్రభుత్వం పన్నిన కుట్రను తిప్పికొట్టాలని ప్రజలకు, ప్రజాసంఘాలకు, ప్రజాస్వామిక వాదులకు విరసం విజ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment