నిర్లక్ష్యం వహిస్తే చర్యలు-కలెక్టర్ రోనాల్డ్ రోస్
Published Sat, Jul 9 2016 4:38 PM | Last Updated on Thu, Mar 21 2019 8:18 PM
హత్నూర: హరితహారం కార్యక్రమాన్ని ప్రణాళిక బద్దంగా విజయవంతం చేసేందుకు మెదక్ జిల్లాలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ అన్నారు. శనివారం హత్నూర మండలం దౌల్తాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నస్తీపూర్ గ్రామ శివారులోని ఎస్సీ, బీసీ వసతిగృహాలతో పాటు రెడ్డిఖానాపూర్ గ్రామ శివారులోని ఓ రైతు పొలంలో ఉద్యమంలా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో రోనాల్డ్ రోస్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి రోజే 3 లక్షలకు పైగా మొక్కలు నాటామని పేర్కొన్నారు. హరిత హారం పథకంలో ఆగష్టు వరకు జిల్లాలో 3కోట్ల మొక్కలను నాటేందుకోసం ప్రణాళికలను తయారు చేశామన్నారు.
ఈ నెల 22 వరకు కోటి మొక్కలను నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో 40వేలకు మొక్కలు తగ్గకుండా నాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క అధికారిపై ఉందని ఇందులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమలు అధికంగా ఉన్న హత్నూర మండలంలోనే అన్ని గ్రామాల్లో మొక్కలు తక్కువ తీసుకెళ్లినట్లు తన దృష్టికి వచ్చిందని, ఇలా అయితే సహించనన్నారు.
మండలంలో 23 గ్రామ పంచాయతీలు ఉండగా 9లక్షల పై చిలుకు మొక్కలు నాటాల్సిన టార్గెట్ ఉంటే కేవలం 7 లక్షలు మాత్రమే ఉన్నాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా అయితే ఎలా అంటూ మండల స్థాయి అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని దౌల్తాబాద్, నస్తీపూర్, రెడ్డిఖానాపూర్ గ్రామాలలో హరితహారం పథకంలో మొక్కలు నాటేందుకు కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌తో పాటు కూతురు కూడా కార్యక్రమాల్లో పాల్గొని మూడుచోట్ల మొక్కలను నాటి అందరిని ఆకట్టుకుంది. తండ్రిని అనుసరిస్తూ కూతురు కూడా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడంపై అందరు ఆసక్తిగా తిలకించారు.
Advertisement