అమ్మ నీకు దండమే.. | medak district de-merge with three districts | Sakshi
Sakshi News home page

అమ్మ నీకు దండమే..

Published Sat, Oct 8 2016 10:09 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM

అమ్మ నీకు దండమే..

అమ్మ నీకు దండమే..

పిల్ల్లలు పెద్దోళ్లు అయ్యిండ్రు..
మెతుకుసీమ నుంచి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలుగా రూపాంతరం
ఏరుబాటే కానీ ఎడబాటు కాదు

సాక్షి ప్రతినిధి సిద్దిపేట: మెతుకుసీమ తల్లి గర్భాన జీవం పోసుకున్న పసిడి కూనలు ఎదిగాయి... జిల్లాలుగా అవతరించబోతున్నాయి. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలుగా ఏరుబడే ఘడియలు రానే వచ్చాయి. 60 ఏళ్లు సాకి సవరించిన పసి పిల్లలకు రెక్కలొచ్చిన వేళ మెతుకుసీమ తల్లి ఎవరి బాధ్యత వాళ్లకు, ఎవరి ఆస్తులు, అప్పులు వాళ్లకు అప్పగించేందుకు సిద్ధమవుతోంది. పెద్దన్న కేసీఆర్‌ అండతో ఎవరిళ్లలో వాళ్లు ఎదగడానికే ఈ ఏరుబాటు గాని ఎడబాటు కాదని హితవు చెప్తోంది.  

పోరుబిడ్డలారా మీకు.. ఉద్యమాల ఖిల్లా.. మెదక్‌ జిల్లా
బిడ్డలారా మీ 60 ఏళ్లకల నేడు సాకారం కాబోతుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన చర్చి.. శత్రుదుర్భేద్యమైన ఖిల్లా.. చెంగుచెంగున దూకే లేడిపిల్లలు.. జింకల పరుగులతో.. కనువిందు చేసే పోచారం అభయారణ్యం.. నిజాం కా షికార్‌ ఘర్‌ మీకే బిడ్డా. మంజీర పరుగులు.. ఏడుపాయల వనదుర్గ దీవెనలు మీకే... పచ్చని పంటపొలాలు.. ఘనపురం జలాలు అన్నదాతలకు వరాలు. కమ్యూనిస్టుల కోట.. పచ్చని అడవుల మూట నర్సాపూర్‌ కూడా మీ వాటా కిందనే ఉన్నాయి.

‘పసిద్ధి చెందిన జైన క్షేత్రం, కోలాచల మల్లినాథ సూరిని గన్న కొల్చారం మీ పరిధిలోకే వస్తుంది. అన్యాయం జరిగిన చోట గళమెత్తే  యుద్ధనౌక గద్దరన్న మీ తోడు ఉంటడు. రాణి రుద్రమ అంశ నా ఆడబిడ్డ పద్మమ్మ మీకు శ్రీరామ రక్ష. ఆపదొచ్చిన...ఆనందమొచ్చినా అక్క ఇంటి గడప తొక్కురి. అక్కున చేర్చుకునే మనుసు నా బిడ్డకే ఉంది. పల్లెలు పచ్చగా ఎదగాలి.. బంగారు తెలంగాణలో భాగస్వామ్యం కావాలి.

సిద్దిపేట..
మొండిధైర్యం.. దండిగుణం ఉన్న పెద్దోడే మీ దిక్కు. గజవెల్లి బంగారు భూములు, దుబ్బాక పాల నురగలు మీ వాటా కిందనే ఉంటయి. కొమరెల్లి మల్లన్న మొక్కులు... మల్లన్న సాగర్‌ జలాల హక్కులు, కొండ పోచమ్మ కొలుపులు మీకే. 50 టీఎంసీల మల్లన్న సాగర్‌ జల ప్రాజెక్టు, ఏడు టీఎంసీల కొండపోచమ్మ ప్రాజెక్టులు మీకిందనే ఉన్నయి. 

నా ముద్దుబిడ్డ కేసీఆర్‌.. జపం చేసి పట్టుకొస్తున్న గోదారమ్మ నీళ్లను  పంచుకోండ్రి. మీ అన్న సంగారెడ్డి జిల్లాకు, చెల్లి మెదకు జిల్లాకు సమానంగా పంచు. ఒక్కసారి నీళ్లు ఇడిస్తే సింగూరు, ఘనపురం, మంజీరాలు నిండి ముగ్గురి దూపదీరుతుంది. పచ్చని పైర్లు, పాడి పంటలు, సిరిసంపదలతో పల్లెలు తులతూగుతాయి.

గీ కాయిష్‌ మీదనే నా బిడ్డ హరీశ్‌ అయినోనితోని, కానోనితోని పడరాని మాటలు పడుతుండు. వచ్చే ఏడాది కాకుంటే.. పై యొచ్చే యేడు మల్లన్న సాగర్‌ నిలబడతది. నియోజకవర్గానికి లక్ష ఎకరాల చొప్పున మీ మూడు జిల్లాలో 10 లక్షల ఎకరాలను తడుపుతది. గీ నీళ్లతోనే చెరువులు, మడుగులు, అన్నీ నిండిపోవాలే. మన తెనుగోళ్లు చేపల వేటలో సాగిపోవాలి.

మనం ఒక్కలమే బతుకుడు కాదు, పైన ఉన్న కరీంనగర్‌కు, పక్కనున్న యాదాద్రికి, అటువైపు కామారెడ్డికి అందరికి నీళ్లు పంచాలి. నలుగురిని బతికించుకుంటూ మీరు బతుకురి బిడ్డా.  మీ బలం, బలగం నా కొడుకు హరిశే... కష్టమొచ్చినా, సుఖమొచ్చినా అన్న ఇంటి గడప తొక్కుడు మీకు తెలిసిందే. అన్నిటికి అన్నమీదే భారం వేసి నిలబడురి.

సంగారెడ్డి..
ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ, పటాన్‌చెరు పారిశ్రామిక వాడ, బీహెచ్‌ఈఎల్, జహీరాబాద్‌ నిమ్జ్‌, అంరబిందో కంపెనీలు అన్ని మీ వైపుకే ఉన్నాయి. వ్యవసాయంలో ఏర్పడ్డ ప్రచ్ఛన్న నిరుద్యోగం పరిశ్రమలతో పోవాలి. ప్రతి యువకునికి పని దొరకాలి. కరువు కాలంలో కమ్మని నీళ్లతో   ఎండిన గొంతులు తడిపే సింగూరు ప్రాజెక్టు ఇక మీదే. ఇన్నేళ్లు హైదరాబాద్‌కు మళ్లిన ఆ జలాలు ఇకపై మీ భూములను తడుపుతయి.

కృష్ణా బేసిన్‌ నుంచి హైదరాబాద్‌కు నీళ్లు అందుతున్నాయి. కాబట్టి, ఇక మన నీళ్లు మన పొలాల్లనే పారాలని పెద్దోడు కేసీఆర్‌ పంతం పట్టిండు. హరీశ్‌ కూడా మీ వెనుకనే ఉండే... ఇక ఢోకా ఉండదు. సింగూరు నీళ్లొచ్చి అందోలు పెద్ద చెరువు మత్తడి దునికే.. చుట్టూ 10 మండలాలకు నీళ్లు పారుతయ్‌. అల్లం, పసుపు పండే ఎర్ర భూములు, ఝరాసంగం శివన్న చూపులు మీ వైపే.

నా పాణం అంతా నారాయణఖేడ్‌ మీదనే ఉంది. ఎటు చూసిన వెనుక బడిన ఆ ప్రాంతం అభివృద్ధికి తలో చేయి కలపాలే. వద్దు వద్దూ అన్నా.. నా నారాయణఖేడ్‌ బిడ్డలంతా సంగారెడ్డిలోనే కలుస్తమని ఇటు వైపు ఇచ్చిళ్లు. ఇల్లు తొక్కి అచ్చిన నా అమాయకపు బిడ్డలను ఆగం చేయొద్దు. అందరికి శనార్థులు. ఆగంగాకురి బిడ్డా... హరిశన్న అండజూసుకొని అభివృద్ధి వైపు అడుగులు వేయిరి బిడ్డా.....
ఇట్లు,
మీ తల్లి
మెతుకుసీమ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement