మెతుకుసీమ మురిసే | medak district intersection into three districts | Sakshi
Sakshi News home page

మెతుకుసీమ మురిసే

Published Mon, Aug 22 2016 10:15 PM | Last Updated on Mon, Oct 8 2018 7:43 PM

మెతుకుసీమ మురిసే - Sakshi

మెతుకుసీమ మురిసే

  • మెదక్‌ ఇకపై మూడు జిల్లాలు
  • నెరవేరిన దశాబ్దాల కల
  • సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాలు
  • కొత్తగా నాలుగు రెవెన్యూ డివిజన్లు
  • అదనంగా నాలుగు కొత్త  మండలాలు
  • ముసాయిదాను విడుదల చేసిన ప్రభుత్వం
  • నేటి నుంచి సలహాలు, అభ్యంతరాల స్వీకరణ
  • మెదక్, సిద్దిపేటలో అంబరాన్నంటిన సంబురాలు
  •  సాక్షి, సంగారెడ్డి: దశాబ్దాల కలలు నెరవేరాయి.. ప్రజల మనోభీష్టం మేరుకు ప్రభుత్వం కొత్త జిల్లాలకు తుదిరూపునిచ్చింది. మెదక్‌ జిల్లాను విభజించి కొత్తగా సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాలు ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. జిల్లాల పునర్విభజనకు సంబంధించి సోమవారం ముసాయిదాను విడుదల చేసింది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. 23 మండలాలతో సంగారెడ్డి పెద్ద జిల్లాగా అవతరించనుంది.

    14 మండలాలతో మెదక్‌ జిల్లా కొనసాగనుంది. 19 మండలాలతో కొత్తగా సిద్దిపేట జిల్లా ఏర్పాటు కానుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కొత్తగా ఏర్పాటుకానున్న సిద్దిపేట, మెదక్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో సంబరాల్లో పాల్గొన్నాయి. మెదక్‌లో జరిగిన వేడుకల్లో డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రజలతో కలిసి నృత్యం చేశారు.

    ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ నాయకులు మిఠాయిలు పంచిపెట్టారు. సిద్దిపేటలో సైతం ప్రజలు, టీఆర్‌ఎస్‌ నాయకులు వేడుకలు జరుపుకున్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు వేడుకల్లో పాల్గొన్నారు. నారాయణఖేడ్‌, జహీరాబాద్‌ డివిజన్లుగా ఏర్పడనుండటంతో  ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఎంపీ బీబీ పాటిల్‌ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఇదిలా ఉంటే కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదాపై కలెక్టరేట్‌లో అధికారులు అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఇందుకోసం కలెక్టరేట్‌లో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయనున్నారు.

    ఎట్టకేలకు నెరవేరిన కల
    దశాబ్దాల కలను ప్రభుత్వం నిజం చేసింది. సిద్దిపేట జిల్లా ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. అలాగే మెదక్‌ ప్రజలు సైతం జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. జిల్లాల  పునర్విభజనలో భాగంగా ప్రభుత్వం మెదక్‌ జిల్లాను విభజించి సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాలను ఏర్పాటు చేస్తూ సోమవారం ముసాయిదాను వెలువరించింది. 

    సిద్దిపేట జిల్లాలో వరంగల్‌ జిల్లాకు చెందిన చేర్యాల్, మద్దూరు విలీనం కానుండగా కరీంనగర్‌ జిల్లాలోని కోహెడ, హుస్నాబాద్‌ మండలాలు విలీనం కానున్నాయి. అలాగే సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన ముస్తాబాద్, ఇల్లంతకుంట మండలాలు సిద్దిపేటలో విలీనం చేయనున్నారు. జిల్లాల ఏర్పాటులో భాగంగా ప్రస్తుతం ఉన్న రెవెన్యూ డివిజన్లకు అదనంగా నాలుగు కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయనున్నారు.

    ప్రతిపాదిత సంగారెడ్డి జిల్లాలో కొత్తగా జహీరాబాద్, నారాయణఖేడ్‌ రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే మెదక్‌ జిల్లాలో తూప్రాన్, సిద్దిపేట జిల్లాలో గజ్వేల్‌ రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. ఇదిలా ఉంటే నర్సాపూర్‌ నియోజవకర్గంలోని కౌడిపల్లిని తూప్రాన్‌ రెవెన్యూ డివిజన్‌లో కలపటం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.  

    కొత్తగా నాలుగు మండలాలు..
    జిల్లాలోని పలు మండలాలను ప్రభుత్వం పునర్విభజించింది. ప్రతిపాదిత మూడు జిల్లాలో కొత్తగా నాలుగు మండలాలను ఏర్పాటు చేయనుంది. సంగారెడ్డి జిల్లాలో నూతనంగా సిర్గాపూర్, అమీన్‌పూర్, గుమ్మడిదల మండలాలు ఏర్పాటు కానున్నాయి. సిద్దిపేట జిల్లాలో కొత్తగా సిద్దిపేట రూరల్‌ మండలం ఏర్పాటు కానుంది.

    ప్రస్తుతం ఉన్న మండలాల నుంచి కొన్ని గ్రామాలను విభజించి కొత్త మండలాలను ఏర్పాటు చేస్తున్నందున్న మండలాల స్వరూపం మారనుంది. కాగా, మెదక్‌ జిల్లాలో ఏ ఒక్క కొత్త మండలం ఏర్పాటు కావటంలేదు. నిజామాబాద్‌ జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలాన్ని విలీనం చేయాలని భావించినప్పటికీ విలీనం చేయలేదు.

    నిజామాబాద్‌ జిల్లా నేతలను నాగిరెడ్డిపేట మండలం విలీనంను గట్టిగా వ్యతిరేకించినందవల్లే ప్రభుత్వం విలీనం వైపు మొగ్గుచూపలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రతిపాదిత కొత్త మండలాల జాబితాలో ఉన్న కంది, హవేలిఘనపురం, నారాయణరావుపేట మండలాల ఏర్పాటుకు సైతం ప్రభుత్వం మొగ్గుచూపలేదు.

    ప్రస్తుతం ఉన్న సంగారెడ్డి మండలాన్ని కంది రూరల్‌ మండలంగా ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ డ్రాప్టు నోటిఫికేషన్‌లో కంది మండలం ఏర్పాటను మినహాయించారు. కంది స్థానంలో నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో సిర్గాపూర్‌ మండలాన్ని ఏర్పాటు చేయనున్నారు.

    కల్హేర్‌ మండలంలోని 9, కంగ్టి మండలంలోని 10, నారాయణఖేడ్‌ మండలంలోని రెండు గ్రామాలను కలుపుతూ కొత్తగా సిర్గాపూర్‌ మండలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అలాగే పటాన్‌చెరు మండలంలోని 11 గ్రామాలతో కొత్తగా అమీన్‌పూర్‌ మండలాన్ని ఏర్పాటు చేయనుంది.

    ప్రస్తుతం 34 గ్రామాలతో జిన్నారం మండలం ఉండగా అందులోని 13 మండలాలను విభజించి కొత్తగా గుమ్మడిదల మండలం ఏర్పాటు కానుంది. ఇక సిద్దిపేట జిల్లాలో కొత్తగా సిద్దిపేట రూరల్, నారాయణరావుపేట మండలాల ఏర్పాటు ప్రతిపాదన ఉండగా ప్రభుత్వం కేవలం కొత్తగా సిద్దిపేట రూరల్‌ మండలాన్ని ఏర్పాటుకు చేయనుంది.

    ప్రతిపాదిత నారాయణరావుపేట మండలం ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గుచూపలేదు. ఇదిలా ఉంటే సీఎం స్వగ్రామమైన చింతమడకను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ ఉంది. అయితే చింతమడకను మండలంగా ఏర్పాటు చేయలేదు. దీంతో అక్కడి ప్రజలు నిరసనలు వ్యక్తం చేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement