కల్లుకుంటకు జ్వరమొచ్చింది
చిలమత్తూరు : మండలంలోని పలగలపల్లి పంచాయతీ కల్లుకుంట గ్రామ వాసులకు జ్వరాలు చుట్టుముట్టాయి. గ్రామంలో సుమారు వందమంది మంచాలబారిన పడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే వైద్య సిబ్బంది స్పందించి గ్రామంలో మంగళవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామంలో 240 ఇళ్లల్లో సుమారు 650 మంది జనాభా నివసిస్తున్నారు. పంచాయతీకి ఒక్క బోరు మాత్రమే ఏర్పాటు చేశారు. కాగా ట్యాంక్‌కు సరఫరా అయ్యే ప్రధాన పైపులైన్ దోబీఘాట్ సమీపంలో పగిలిపోయింది. దీంతో పైప్‌లైన్‌లోకి మురుగునీరు చేరి కలుషితం అవుతున్నాయి. ఆ నీటిని తాగడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు.
గ్రామంలో జ్వరాలు ప్రబలిన విషయం తెలుసుకున్న సర్పంచ్ జయశంకర్‌రెడ్డి వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. సీహెచ్‌ఓ ఫకద్దీన్, ప్రకాష్ స్పందించి గ్రామానికి చేరుకుని వైద్య పరీక్షలు నిర్వహించి మాత్రలు పంపిణీ చేశారు. కాగా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ఎక్కడ పడితే అక్కడ మురుగు నీరు నిల్వ ఉండి రోగాలు ప్రబలుతున్నాయని వైద్యులు తెలిపారు. అధికారులు స్పందించి డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని, పైపులైన్ సరిచేసి, దోభీఘాట్‌లు మంజూరు చేయాలని స్థానికులు గంగులప్ప, డి.నరసింహయ్య, శ్రీనివాసులు, లక్ష్మీపతి, బి.నరసింహయ్య, వీరనారాయణ, క్రిష్టప్ప డిమాండ్ చేశారు.