ఆగస్టు 6 దాకా నిర్వహణ
ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి 50 శాతం సీట్ల భర్తీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ రాసిన వైద్య విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి బుధవారం నుంచి ఆగస్టు 6 దాకా కౌన్సెలింగ్‌కు సర్వం సిద్ధమైంది. జేఎన్టీయూ-ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని కళాశాలల్లో, ప్రైవేటులోని కన్వీనర్ కోటా కింద కలిపి 50 శాతం సీట్లకు ఈ ఆన్‌లైన్ కౌన్సెలింగ్ జరగనుంది. తెలంగాణలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని 850, ప్రైవేటు వైద్య కళాశాలల్లోని ‘ఎ’ కేటగిరీలోని 725 కలిపి మొత్తం 1,575 సీట్లను ఇందులో భర్తీ చేస్తారు. బీడీఎస్‌లో ప్రభుత్వ కాలేజీల్లోని 100 సీట్లు, ఆర్మీ కాలేజీలోని 40, ప్రైవేటులోని ‘ఏ’ కేటగిరీకి చెందిన 500... ఇలా మొత్తం 640 సీట్లను భర్తీ చేస్తారు. హైదరాబాద్‌లో కూకట్‌పల్లి జేఎన్‌టీయూ, ఉస్మానియా క్యాంపస్‌లోని పీజీఆర్‌ఆర్ దూర విద్యా కేంద్రంలో, వరంగల్‌లో కాకతీయ వర్సిటీలో, విజయవాడలో డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలి దశలో ఓపెన్ కోటా కింద ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల్లోని అందరికీ కలిపి బుధవారం (29) నుంచి 31వ తేదీ దాకా; రెండు, మూడు దశల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఆగస్టు 1 నుంచి 3వ తేదీ దాకా కౌన్సెలింగ్ ఉంటుంది.