మీనం.. ధర దీనం
Published Sun, Mar 12 2017 2:06 AM | Last Updated on Tue, Sep 5 2017 5:49 AM
ఏలూరు (సెంట్రల్) : చేపల ధర తగ్గిపోవడంతో ఆక్వా రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎండలు ముదిరిపోవడంతో చెరువుల్లో నీటిమట్టం తగ్గిపోతోంది. దీంతో పెద్ద సంఖ్యలో రైతులు చేపల పట్టుబడి పడుతున్నారు. డిమాండ్‌కు మించి సరుకు మార్కెట్‌ను ముంచెత్తుతుండడంతో చేపల ధర ఒక్కసారిగా పడిపోయింది. వారం, పది రోజుల క్రితం వరకు శీలావతి కిలో రూ.105 నుంచి రూ.110 మధ్య పలకగా వారం రోజులుగా ధర పడిపోయింది. కిలోకు రూ.30 వరకు తగ్గి రూ.85కు చేరగా, కిలో రూ. 80కు విక్రయించే ఫంగస్ రూ.35 తగ్గి రూ.45కు చేరింది. శనివారం మార్కెట్‌లో శీలావతి కిలో రూ.85, ఫంగస్ రూ.45 వరకు వ్యాపారులు విక్రయాలు జరిపారు.
నిత్యం 60 టన్నుల ఎగుమతులు
కైకలూరు, ఆకివీడు, కొల్లేరు గ్రామాలు, పెదపాడు మండలాల నుంచి ఏలూరు మార్కెట్‌కు నిత్యం భారీస్థాయిలో చేపలు వస్తాయి. మార్కెట్‌లో
అమ్మకాలు పోను మిగిలిన చేపలను వ్యాపారులు ఇతర రాష్ట్రాలు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఏలూరు మార్కెట్ నుంచి యూపీ, ఒడిశా, హౌరా, కోల్‌కతాలకు ప్రతి రోజు 50 టన్నుల నుంచి 60 టన్నుల వరకు ఎగుమతులు జరుగుతాయి. ఇటీవల చేపల దిగుబడి పెరిగిపోవడంతో ఒక్క ఏలూరు మార్కెట్ నుంచే 100 టన్నుల వరకు చేపలు ఎగుమతి జరుగుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. జిల్లాలో గణపవరం, నారాయణపురం, భీమవరం ప్రాంతాల నుంచి ప్రతి రోజూ 500 నుంచి 600 టన్నుల వరకు ఎగుమతులు జరుగుతున్నాయి. మరోవైపు రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు రావడంతో చేపలు చనిపోతాయనే భయంతో కూడా ఎక్కువగా పట్టుబడి పడుతున్నారు. అయితే ధర పతనంతో నష్టపోతున్నామని, అయినకాడికి అమ్ముకోకపోతే పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. నెల రోజుల వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
ధర పతనంతో నష్టాలు
వారం రోజులుగా చేపల ధరలు ఒక్కసారిగా తగ్గిపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. వేసవికాలం నేపథ్యంలో చెరువుల్లో నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. దీంతో రైతులు చేపలను పట్టుబడి చేసి మార్కెట్లకు తీసుకువస్తున్నారు. చేపలు మార్కెట్‌ను ఎక్కువగా రావడంతో ధరలు పడిపోయాయి. – మిడత రామ్‌తేజ, చేపల వ్యాపారి
కొనేవారు కరువు
రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. చేపలు చెరువుల్లో బతికే అవకాశం లేదు. దాంతో చేపలను ఎక్కువగా పట్టుబడులు చేస్తున్నారు. చేపల దిగుబడి పెరిగింది కానీ ధరలు లేకుండా పోయాయి. రైతులకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది. – ఎ.గణేష్, చేపల వ్యాపారి
నష్టాలు తప్పవు
చెరువుల్లో నీళ్లు లేకపోవడంతో పట్టుబడి చేస్తున్నాం. చేపలు పట్టుబడి చేస్తున్న సమయంలో చాలా వరకు చేపలు చనిపోతున్నాయి. మార్కెట్‌లో చేపలు ఎక్కువగా ఉండడంతో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో గిట్టుబాటు ధర రాక నష్టాలు తప్పేలా లేవు. – ఎం.చింతయ్య, రైతు, పోతునూరు
Advertisement
Advertisement