మెక్కింది కక్కిస్తా | mekkindi- kakkista | Sakshi
Sakshi News home page

మెక్కింది కక్కిస్తా

Published Fri, Aug 19 2016 12:31 AM | Last Updated on Sat, Oct 20 2018 5:39 PM

zp chairman - Sakshi

zp chairman

-  ‘నీరు–చెట్టు’ అంతా అవినీతి మయం
-  30 శాతం ముడుపులు తీసుకొని పనులు మంజూరు
- పనిచేయకుండానే బిల్లులు
-  జేసీబీలతో గుంతలు తీసి.. నేతలు కోట్లు కొల్లగొడుతున్నారు
-  నేను రంగంలోకి దిగుతా.. మీ అంతు తేలుస్తా..
- జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఇరిగేషన్‌ అధికారులపై ఈదర ఫైర్‌
- అవినీతి నిరూపిస్తా..అధికారులను సస్పెండ్‌ చేస్తారా..అంటూ నిలదీత
-  అధికారుల తీరుపై విరుచుకుపడిన జెడ్పీ చైర్మన్‌ 
 
ఒంగోలు: ‘మీరు విచక్షణారహితంగా అవినీతి చేశారు.. నేను నిరూపిస్తా! మీ అధికారులను సస్పెండ్‌ చేస్తారా? 30 శాతం డబ్బులు రుచిమరిగి మీ కళ్లు నెత్తికెక్కాయి’ అంటూ ఇరిగేషన్‌ ఎస్‌ఈ శారదపై జెడ్పీ చైర్మన్‌ ఈదర హరిబాబు మండిపడ్డారు. నీరు–చెట్టు పనుల్లో జరుగుతున్న అవినీతిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం ఒంగోలులో జరిగిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ఇరిగేషన్‌ పనులను సమీక్షించారు. ప్రభుత్వం మంచి జరగాలని నిధులిస్తే.. అధికారులు, నాయకులు కలిసి అవినీతికి తెర లేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వామాలోనూ అవినీతికి అంతే లేకుండాపోయిందని ధ్వజమెత్తారు. అవినీతిని అరికట్టేందుకు మీ దగ్గర ఎలాంటి పద్ధతి లేదా.. అంటూ డ్వామా పీడీపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. వాగులు క్లీన్‌ చేసి నీటిని సముద్రం పాలు చేస్తున్నారు తప్ప చెక్‌డ్యామ్‌లను నిర్మించి నీటిని నిల్వ చేసే ప్రయత్నం చేయటం లేదన్నారు.
సర్పంచ్‌ హక్కులు ఉంటాయి..
పంచాయతీ సర్పంచులతో పాటు ప్రజాప్రతినిధులకు సమస్యలపై వినతిపత్రాలు తీసుకొనే అధికారం లేదని డీఎల్‌పీవో ఇచ్చిన ఉత్తర్వులను.. జిల్లా పంచాయతీ అధికారి బలపరచడాన్ని నాగులుప్పలపాడు ఎంపీపీ వీరయ్యచౌదరి సభ దృష్టికి తెచ్చారు. అలా ఆదేశాలివ్వడం సరికాదని తక్షణం వాటిని ఉపసంహరించుకోవాలని చైర్మన్‌ జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. 30 శాతం మ్యాచింగ్‌ గ్రాంటుతో ఉపాధి హామీ పథకం సిమెంట్‌ రోడ్లే వేయాలని అధికారులు ఆదేశించడాన్ని తప్పుబట్టారు. సర్పంచ్‌ హక్కులకు భంగం కలగకుండా చూడాలన్నారు. 
మత్స్యకారులు దరఖాస్తు చేసుకోండి
మత్స్యశాఖ పరిధిలో రూ. 5 కోట్ల నిధులున్నాయని, వేటకు సంబంధించిన సబ్సిడీ పరికరాల కోసం మత్స్యకారులు దరఖాస్తులు చేసుకోవాలని చైర్మన్‌ సూచించారు. సమావేశాలకు అధికారులు  హాజరు కాకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యుత్‌ లైన్ల ఏర్పాటు సమయంలో రైతులు కోల్పోతున్న భూమికి పరిహారం చెల్లించడం లేదని మార్కాపురం ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తెచ్చారు. ఆర్‌డబ్లూ్యఎస్‌ పరిధిలో అక్రమాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయని అసలు పనులు చేయకుండానే కోట్లాది రూపాయల బిల్లులు స్వాహా చేశారని జెడ్పీ చైర్మన్‌.. ఆర్‌డబ్లూ్యఎస్‌ అధికారులపై విరుచుకుపడ్డారు.కొమరోలు ప్రాంతంలో గతంలో రూ. 70 లక్షలతో వేసిన పైప్‌లైన్‌ నీరు వదలకుండానే కనిపించకుండాపోయిందని దీనిపై విజిలెన్స్‌ విచారణ చేయించాలని  ఆదేశించారు. సాగర్‌ జలాలతో నోటిఫైడ్‌ ట్యాంకులతో పాటు అన్ని ట్యాంకులను ముందు నీటిని నింపాలని పలువురు ప్రజాప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఇదే విషయాన్ని జెడ్పీ తీర్మానం ద్వారా కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లాలని సభ తీర్మానించింది. మాచవరం, మోపాడు చెరువు కాలువ పనులు నాలుగు సంవత్సరాల్లో పెండింగ్‌లో ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తెచ్చారు.  త్వరితగతిన పూర్తి చేయిస్తామని ఎస్‌ఈ శారద హామీ ఇచ్చారు. 
 
ప్రాజెక్టులు పూర్తి చేయండి
– మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి
పొదిలిలో ఎన్‌ఎస్‌పీ వాటర్‌ రావటం లేదని మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి అన్నారు. ఎన్‌ఎస్‌పీ కాలువలకు గండ్లు కొట్టకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్టు పనులను అధికారులు చిత్తశుద్ధితో పూర్తి చేయటం లేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు వెలిగొండకు నీళ్లిస్తామంటూ మాటలతో సరిపెడుతున్నారని విమర్శించారు. భూసేకరణ, పునరావాసం పూర్తి కాకుండానే పనులు ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు.  
జిల్లా ప్రజల దాహార్తి తీర్చండి
– సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌
జిల్లాలో సర్పంచుల హక్కులకు భంగం వాటిల్లుతోందని, తక్షణం సర్పంచులకు న్యాయం జరిగేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. పం చాయతీరాజ్‌ వ్యవస్థలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్పంచులకు పూర్తి అధికారాలున్నాయని.. అయితే అధికార పార్టీ ఒత్తిడులతో అధికారులు సర్పంచుల హక్కులకు భంగం కలిగిస్తున్నారన్నారు. జిల్లాలో వైద్యారోగ్యశాఖ ప్రజారోగ్యంపై శ్రద్ధ పెట్టాలన్నారు. పూర్తయిన ఆస్పత్రి భవనాలను ఎవరికోసమో ప్రారంభించకపోవడం దారుణమని చెప్పారు. ఎన్‌ఎస్‌పీ పరిధిలో నోటిఫైడ్, నాన్‌నోటిఫైడ్‌ ట్యాంకులను తక్షణం నీటితో నింపాలని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement