పిఠాపురం టౌన్ :
బతుకు పోరాటంలో అలసిపోయాడు. జీవితంలో స్థిరపడాలనుకున్న అతడికి అడుగడుగునా ఎదురుదెబ్బలే తగిలాయి. ఇక ఎవరినీ నిందించడం ఇష్టంలేక తనువు చాలించాడు. జీవితంలో నిలదొక్కుకుంటానన్న నమ్మకం లేక, మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పిఠాపురం మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన పాలపర్తి వెంకట సత్యనారాయణ(27) కొంతకాలంగా స్థానిక ఈశ్వరనగర్‌లో అద్దెకు ఉన్నాడు. ఉప్పాడ రైల్వేగేటు సమీపంలో పాలు అమ్ముతూ జీవితం గడిపేవాడు. అంతకుముందు చాలాచోట్ల పనిచేసినప్పటికీ, ఎక్కడా నిలదొక్కుకోలేకపోయాడు. దాంతో షాపులో ఉన్న ఇనుపగొట్టానికి తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలంలో అతడు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జీవితంపై ఏ ఆశ లేకుండా ఇంతకాలం బతికానని, వ్యాపారంలో స్థిరపడదామనుకున్నా.. అది కూడా చేజారిపోయిందని అందులో సత్యనారాయణ పేర్కొన్నాడు. ఎవరినీ నిందించలేని పరిస్థితిలో, తన చేతకానితనం కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాశాడని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు.