పట్టాలపై రాళ్లు పెట్టిన మతిస్థిమితం లేని వ్యక్తి
-
అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు
-
సమాచారం ఇచ్చిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్ డ్రైవర్
-
తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
మహబూబాబాద్ : మానుకోట రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్‌కు ఇరువైపులా ఉన్న డౌన్‌లైన్ పట్టాలపై ఆదివారం రాత్రి సుమారు 10 గంటల నుంచి 10.30 మధ్యలో మతిస్థిమితం లేని వ్యక్తి కంకర రాళ్లు పెట్టాడు. గమనించిన ఆర్‌పీఎఫ్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్పీఎఫ్ అవుట్‌పోస్ట్ ఎస్సై కె.మధు కథనం ప్రకారం.. బలార్షా నుంచి విజయవాడ వెళ్లే తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ఆదివారం రాత్రి మానుకోట రైల్వేస్టేషన్ నుంచి డౌన్‌లైన్‌లో బయల్దేరింది. ఆ రైలుకు మానుకోట రైల్వేస్టేషన్ ఏ క్యాబిన్ సమీపంలో పలు కంకరరాళ్లు తగలగా ప్లాట్‌ఫారమ్ దాటిన తర్వాత కూడా కంకర రాళ్లు ఎగిసిపడ్డాయి. పెద్ద శబ్దం వచ్చింది. దీంతో గుండ్రాతిమడుగు రైల్వేస్టేషన్‌లో డ్రైవర్ రైలును ఆపాడు. రైలును తనిఖీ చేసుకొని వెంటనే మానుకోట రైల్వేస్టేషన్‌కు సమాచారమిచ్చాడు. కేవలం 3 నిమిషాల వ్యవధిలోనే రైలు తిరిగి బయల్దేరింది. దీంతో ఆర్‌పీఎఫ్ సిబ్బంది వెళ్లి పరిశీలించగా ప్లాట్‌ఫామ్‌కు ఏ క్యాబిన్‌కు మధ్య పట్టాలపై కొన్ని కంకరరాళ్లు, రైల్వేస్టేషన్ ఆర్‌యూబీకి మధ్య సుమారు 10 కంకర రాళ్లను పట్టాలపై మతిస్థిమితం లేని వ్యక్తి పెట్టడాన్ని గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని విచారించి, సోమవారం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మతిస్థిమితం లేకపోవడం, మూగవాడు కావడం వల్ల సరైన సమాధానం రావడం లేదని ఆర్పీఎఫ్ ఎస్సై తెలిపారు. తెలంగాణకు చెందినవాడా లేక ఇతర రాష్ట్రాలకు చెందిన వాడా అనేది తెలియడం లేదన్నారు. కంకరరాళ్లు పట్టాలపై ఏర్పాటు చేయడం ప్రమాదకరమని ఏ మాత్రం ఎక్కువ రాళ్లు ఉన్నా రైలు చక్రాలు కిందికి దిగేవని, దీంతో ప్రమాదం జరిగి ఉండేదని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. ఏదేమైనా రైలుకు ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడ రైల్వే ఇంటర్ లాక్ సిస్టం పనుల కారణంగా కొన్ని రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. దీని వెనుక మరో రైలు రాకపోవడంతో వెంటనే రైల్వే పోలీసులు అప్రమత్తం కావడంతో ప్రమాదం జరగకుండా చూశారు.