
విభాగాల విలీనం ?
ఇంతకాలం ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించిన ఎస్‌ఎస్‌ఏ ఇంజనీరింగ్ విభాగంలో
►ఒకే గొడుగు కిందికివిద్యాశాఖలోని ఇంజనీరింగ్ విభాగాలు
►టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీలో ఎస్‌ఎస్‌ఏ కలిపేందుకు కసరత్తు
►రాష్ట్ర కార్యాలయానికి పనుల నివేదిక
కాళోజీ సెంటర్: ఇంతకాలం ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించిన ఎస్‌ఎస్‌ఏ ఇంజనీరింగ్ విభాగంలో మార్పులు జరగబోతున్నాయి. జిల్లాల విభజనతో అన్ని శాఖల్లోనూ విభజన జరిగినప్పటికీ విద్యాశాఖలో అంతర్లీనంగా ఉన్న సర్వశిక్ష అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) ఇంజనీరింగ్ విభాగం మాత్రం ఉమ్మడి జిల్లా యూనిట్‌గానే కొనసాగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో మౌలిక వసతులకు సంబంధించిన సుమారు రూ.35 కోట్ల పనులు జరుగుతున్నాయి. పాఠశాలల్లో సర్వశిక్ష అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) ఇంజనీరింగ్ విభాగం ద్వారా పాఠశాలల్లో నిర్మాణ పనులు జరుగుతుండగా.. అన్ని రకాల ప్రభుత్వ హాస్టళ్లు, కళాశాలల్లో తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్టక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ) ద్వారా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు పాఠశాలలు, కళాశాలల్లో నిర్మాణ పనుల కోసం రెండు ఇంజనీరింగ్ విభాగాలు పనిచేయటం అనవసరమని భావించి ఒకే విభాగం ద్వారా పనులు చేయాలని నిర్ణయించారు.
ఎస్‌ఎస్‌ఏ విభాగంలో..
ఎస్‌ఎస్‌ఏ ఇంజనీరింగ్ విభాగంలో ఒక ఈఈ, ఇద్దరు, డీఈలు, 17 మంది ఏఈలు, ముగ్గురు కార్యాలయ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరంతా ప్రస్తుత ఐదు జిల్లాలో సుమారు రూ.35 కోట్ల పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, అదనపు తరగతిగదుల నిర్మాణం, వంట గదులు, పైకా బిల్డింగులు, ప్రహారీగోడల నిర్మాణం, పైపులైన్ నిర్మాణ పనులు చేస్తున్నారు. టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీలో ప్రతి ఏటా వందల కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్న పనుల వివరాలను ఎస్‌ఎస్‌ఏ రాష్ట్ర అధికారులకు జిల్లా అధికారులు సమర్పించారు. ప్రభుత్వం ఎస్‌ఎస్‌ఏ ఇంజనీరింగ్ విభాగాన్ని విలీనం చేస్తే ప్రభుత్వ విద్యాసంస్థల్లో జరిగే అభివృద్ధి పనులను ఇక మీదట రెండు శాఖల అధికారులు కలిసి పర్యవేక్షిస్తారు. రెండు జిల్లాలకు కలిపి ఒక ఈఈని నియమించే అవకాశం ఉంది. తెలంగాణలో పాత పది జిల్లాల్లో ప్రతి జిల్లాకు ఎస్‌ఎస్‌ఏకు ఒక ఈఈ, టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీకి ఒక ఈఈ ఉన్నారు. విలీనం తర్వాత రెండు జిల్లాలకు ఒక ఈఈని నియమించే అవకాశం ఉంది. మరో వారంలో విలీన ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
పనులు వేగవంతమయ్యేనా..?
ప్రస్తుతం ఎస్‌ఎస్‌ఏ పరిధిలో వందల సంఖ్యలో పనులు ఉన్నాయి. కానీ వాటి విలువ చూస్తే చాలా తక్కువ. అదే టీఎస్‌ఈడబ్ల్యూడీసీలో పనుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ విలువ మాత్రం వందల కోట్లలో ఉంది. రెండు ఇంజనీరింగ్ విభాగాల్లో జరుగుతున్న పనుల్లో ఆశించిన వేగం మాత్రం లేదు. రెండు శాఖలు ఒకటిగా మారితే పనుల్లో వేగం వస్తుందా..? అనే సందేహం అందరిలో కలుగుతోంది. పనులు వేగంగా జరిగితేనే నాణ్యమైన వసతులు విద్యార్థులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.