మెరిట్ జాబితాలు ఆన్‌లైన్‌లోనే.. | Merit lists to be released through online | Sakshi
Sakshi News home page

మెరిట్ జాబితాలు ఆన్‌లైన్‌లోనే..

Published Wed, Oct 21 2015 2:18 AM | Last Updated on Sun, Sep 3 2017 11:15 AM

మెరిట్ జాబితాలు ఆన్‌లైన్‌లోనే..

మెరిట్ జాబితాలు ఆన్‌లైన్‌లోనే..

- ఆటోమేటిక్ జనరేషన్‌కు టీఎస్‌పీఎస్సీ యోచన
-  ఉద్యోగాల సంఖ్యను బట్టి రోస్టర్, రిజర్వేషన్ల మేరకు అన్నీ ఆటో జనరేషన్
- ఇంటర్వ్యూ జాబితాల రూపకల్పన కూడా ఆన్‌లైన్ ద్వారానే
- పారదర్శకతకే ప్రథమ ప్రాధాన్యం.. టీఎస్‌పీఎస్సీ కసరత్తు
 
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ పరీక్షల్లో పారదర్శకతకే ప్రాధాన్యం ఇస్తున్న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) మరో కీలకమైన అంశంపై దృష్టి సారించింది. ఉద్యోగ పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు వివిధ చర్యలు చేపడుతున్న కమిషన్ ఇప్పుడు పరీక్షల తర్వాత ప్రక్రియను ఆన్‌లైన్ ద్వారా చేపడితే ఎలా ఉంటుందన్న ఆలోచనలు చేస్తోంది. అభ్యర్థుల మెరిట్ జాబితాలను ఆన్‌లైన్ ద్వారా ఆటోమేటిగ్గా జనరేట్ అయ్యేలా చర్యలు చేపట్టాలని భావిస్తోంది. తద్వారా ఏ దశలోనూ మానవ తప్పిదాలకు ఆస్కారం లేకుండా చేయాలని యోచిస్తోంది. వీటికి సంబంధించిన అంశాలపై టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి దృష్టి కేంద్రీకరించినట్టు తెలిసింది.
 
 దేశంలో ఎక్కడాలేని విధంగా ఉద్యోగ పరీక్షలను మొదటిసారిగా ఆన్‌లైన్ ద్వారా నిర్వహించి చరిత్ర సృష్టించిన టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ నియామకాల ప్రక్రియను కూడా ఆన్‌లైన్ ద్వారా చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఇది కొంత కష్టతరమైన ప్రక్రియే అయినా.. ఆన్‌లైన్ ద్వారా చేపడితే పారదర్శకతను మరింతగా పెంచవచ్చని భావిస్తోంది. ఇందుకోసం భారీ కసరత్తు చేయాల్సి ఉంది. ఇందులో ప్రతీది ఆన్‌లైన్ చేయాల్సి వస్తుంది. ఇందుకు ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ రూపొందించాలి. నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్టులతో పాటు మొత్తం పోస్టుల్లో ఎన్ని ఏ రిజర్వేషన్ వారికి కేటాయించాలి? ఓపెన్ కోటాలో ఉన్న పోస్టులు ఎన్ని? వాటి రోస్టర్ పాయింట్లు ఎలా ఉన్నాయి? రిజర్వేషన్లవారీగా పోస్టులను విభజించడంతోపాటు పరీక్షకు ఎంత మంది అభ్యర్థులు హాజరయ్యారు?

అందులో ఏ రిజర్వేషన్లకు చెందిన అభ్యర్థులు ఎంతెంత మంది? వారు రాత పరీక్షలో సాధించిన మార్కులు ఎన్ని? అన్న సమగ్ర వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. అంతేకాక ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా పోటీ పరీక్షల్లో మార్కులు సాధించిన అభ్యర్థులందరి కామన్ మెరిట్ జాబితాతోపాటు రిజర్వేషన్లవారీగా మెరిట్ జాబితాలను జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలున్న పోస్టులకైతే 1:2 చొప్పున జాబితాలను జనరేట్ చేయాలి. ఇందులో రిజర్వేషన్ల వారీగా పోస్టులు.. రిజర్వేషన్ల వారీగా అభ్యర్థులను తీసుకుని ఆయా రిజర్వేషన్ కేటగిరీల్లో మెరిట్ ప్రకారం ఇంటర్వ్యూలకు అభ్యర్థుల జాబితాను జనరేట్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రక్రియ క్లిష్టమైనదేనని కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ చక్రపాణి గ్రహించారు.
 
 అయితే దీనిని విజయవంతం చేయగలిగితే పోస్టులకు ఎంపికైన వారి ఎంపిక జాబితాల రూపకల్పన సులభం కావడంతోపాటు పారదర్శకతను మరింతగా పెంచవచ్చని భావిస్తున్నారు. ప్రభుత్వంలోని ఏ విభాగమైనా ఏ పోస్టులకు ఉద్యోగ పరీక్షలను నిర్వహించినా ఈ ప్రక్రియ మొత్తాన్ని మాన్యువల్‌గానే చేస్తున్నాయి. టీఎస్‌పీఎస్సీ నేతృత్వంలో దీనిని ఆన్‌లైన్ ద్వారా చేయగలిగితే మెరిట్ జాబితాల రూపకల్పనలో, ఉద్యోగ నియామకాల్లో ఏ స్థాయిలోనూ లోపాలకు, మానవ తప్పిదాలకు ఆస్కారం ఉండదని కమిషన్  వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ ప్రక్రియను ఒకటికి ఐదారుసార్లు పరీక్షించి అమల్లోకి తేవాల్సి ఉంటుందని పేర్కొంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement