త్వరలో 2 వేల పోస్టులకు నోటిఫికేషన్లు
- ఆ తరువాత 8,792 టీచర్ పోస్టులకు జారీ
- టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌తో ఎంపీ బాల్క సుమన్, మేయర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ కేటగిరీల్లో త్వరలోనే 2 వేల పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోందని ఎంపీ బాల్క సుమన్ తెలిపారు. ఆ తరువాత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 8,792 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కానుందన్నారు. ఎంపీతో పాటు జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, బీసీ కమిషన్ సభ్యుడు ఆంజనే యులు గౌడ్, టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, టీఆర్‌ఎస్‌వీ నేత రాకేశ్ తదితరులు టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, కార్యదర్శి వాణీప్రసాద్‌ను శుక్రవారం టీఎస్ పీఎస్సీ కార్యాలయం లో కలిశారు.
పోస్టుల భర్తీ ప్రక్రియను వేగ వంతం చేయాలని కోరారు. పోస్టుల నియామకాల ప్రక్రియ, త్వరలో జారీ కావాల్సిన నోటిఫికేషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే గురుకులాల్లో 7,306 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిందని, త్వరలోనే స్కూల్ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వస్తుందన్నారు. రాష్ట్రంలో విడతలవారీగా ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. త్వరలోనే గ్రూపుృ2 ఫలితాలను విడుదల చేస్తామని ఘంటా చక్రపాణి వెల్లడించినట్లు తెలిపారు.