పాలు = యూరియా + మంచినూనె
ఘట్‌కేసర్: కల్తీ పాల తయారీ గుట్టును సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు రట్టు చేశారు. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం అవుశాపూర్‌లో ఈ ఘటన బుధవారం వెలుగుచూసింది. అవుశాపూర్‌కు చెందిన రషీద్, నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం అనంతారం గ్రామానికి చెందిన రవి గతంలో పాల వ్యాపారం చేశారు. దీంతో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. సులువుగా డబ్బు సంపాదించాలని ఉద్దేశంతో కల్తీపాల తయారీని ఎంచుకున్నారు. దీనికి మండలంలోని ఏదులాబాద్ శివారులో మూసివేసిన దాబాను అద్దెకు తీసుకున్నారు. 10 రోజులుగా కల్తీపాలు తయారు చేస్తూ వాటిని నగరంలోని హోటళ్లు, ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు.
విశ్వసనీయ సమాచారంతో ఎస్‌వోటీ పోలీసులు బుధవారం కల్తీ పాల కేంద్రంపై దాడి చేశా రు. 720 లీటర్ల కల్తీపాలు, 40 కిలోల యూరియా, 2 టాటా ఏస్ ఆటోలు, 10 ఫ్రీడం ఆయిల్ ప్యాకెట్లు, 18 పాలపౌడర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. యూరియా, మంచినూనెను ఉపయోగించి కల్తీ పాలను తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రషీద్, రవిని పట్టుకున్నారు. వారు గతంలోనూ కల్తీ పాలను తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు.