– అలరించిన నృత్యాలు
– ఆకట్టుకున్న నాటక ప్రదర్శన
– డాక్టర్ మధుసూదనరావుకు పురస్కారం
నంద్యాల: చిన్నారుల అద్భుత నృత్యాలు.. ఏకపాత్రాభినయాలు.. సామాజిక అంశాలపై ప్రముఖుల చర్చ.. రాష్ట్రస్థాయి బంగారు, వెండి నంది అవార్డులు సాధించిన నాటకాల ప్రదర్శనలతో మినీ నందినాటకోత్సవం కనుల పండువగా ముగిసింది. స్థానిక మున్సిపల్ టౌన్‌హాల్‌లో సోమవారం అర్థరాత్రి వరకు జరిగిన కార్యక్రమాలను ప్రేక్షకులు తిలకించారు. తెలుగుభాష దినోత్సవం సందర్భంగా కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. ప్రముఖ రచయితలు డాక్టర్ ఉదయ్‌శంకర్, శ్రీదేవి, డాక్టర్ సహదేవుడు, డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ రవికృష్ణ, కరీముద్దీన్ ఉరఫ్ చందన్, రామకృష్ణారెడ్డి, అన్నెం శ్రీనివాసరెడ్డి, నీలకంఠాచారి, మహబూబ్‌బాషా, రవికుమార్, జానపద కవి ప్రదీప్‌లు తమ కవితా మాధుర్యంతో అలరించారు. వీరిని లయన్స్ క్లబ్ సభ్యులు భవనాశి మహేష్, పెసల శ్రీకాంత్, ఆంజనేయులు గుప్త, రవిప్రకాష్, శ్రీకాంత్, ఉపేంద్రనాథరెడ్డి సన్మానించారు.
డాక్టర్ మధుసూదనరావుకు పురస్కారం...
కళారాధన అధ్యక్షుడిగా, ఈఎన్‌టీ సర్జన్‌గా, చారిటబుల్ ట్రస్ట్ ద్వారా డాక్టర్ మధుసూదనరావు అందించిన సేవలకు మదర్‌థెరిసా జీవిత కాల సాఫల్య సేవా పురస్కారాన్ని ఎంపీ ఎస్పీవైరెడ్డి, రోటరీ క్లబ్ గవర్నర్ కందుకూరి శ్రీరామ్మూర్తి, లయన్స్ క్లబ్ వైస్ గవర్నర్ ఏవీఆర్ ప్రసాద్, కళారాధన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ అందజేశారు. ఆయనకు గజమాల, పూలకిరీటం, జ్ఞాపిక, అందజేశారు.
క్రీడలకు ప్రాథమిక దశ నుండే ప్రాముఖ్యతను ఇవ్వాలి..
క్రీడలకు ప్రాథమిక దశ నుండే ప్రాముఖ్యతను ఇవ్వాలని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా ధ్యాన్‌సింగ్, మిల్కాసింగ్ చర్చావేదికపై మనదేశ క్రీడా విధానం ఆశాజనక ఫలితాలు, లోపాలు అనే అంశంపై లయన్స్ క్లబ్ అధ్యక్షుడు భవనాశి నాగమహేష్ అధ్యక్షతన చర్చావేదిక జరిగింది. అందులో రామకష్ణ విద్యాసంస్థల అథినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి, రిటైర్డు పీఈటీ టీచర్ దివాకర్, డాక్టర్ రవికృష్ణ, గురురాఘవేంద్ర, రావూస్‌విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సైకత శిల్పం...
కళారాధన సంస్థ రూపొందించిన సైకత శిల్పం సాంఘిక నాటకం ఆకట్టుకుంది. భార్యభర్తల బంధం సంజీవ శిల్పంగా చిరకాలం ఉండాలని సైకత శిల్పంలా తాత్కాలికంగా మారకూడదని దర్శకుడు డాక్టర్ రవికష్ణ ప్రేక్షకుల కళ్లకు కట్టినట్లు తెలియజేశారు. మినీ నంది నాటకోత్సవాల సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. లాఫింగ్ క్లబ్ కార్యదర్శి మాలేపాటి రాజశేఖర్, గురురాఘవేంద్ర విద్యాసంస్థల కో డైరెక్టర్లు మౌలాలిరెడ్డి, షేక్షావలీరెడ్డి పాల్గొన్నారు.