నైపుణ్యంలేని కార్మికులతో బ్లాస్టింగ్
పరిమితికి మించి బ్లాస్టింగ్‌లు
వైబ్రేషన్‌కు దెబ్బతింటున్న గృహాలు
బతుకుతెరువు కోసం పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చినవారి జీవితాలు బండరాళ్ల మధ్య నలిగిపోతున్నాయి. వారి కుటుంబాలు దెబ్బతింటున్నాయి. మెటల్ (రాతి) క్వారీల్లో భద్రతా చర్యలు చేపట్టకపోవడం, నిపుణలు కాని కార్మికులతో బ్లాస్టింగ్‌లు నిర్వహించడం, కనీస రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో క్వారీల్లో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా, పలువురు వికలాంగులుగా మారుతున్నారు. కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు కావడం లేదు. అయినా యాజమాన్యాలు కానీ, అధికారులు కానీ చట్టాల అమలులో నిర్లక్ష్యాన్ని వీడడం లేదనే విమర్శలు ఉన్నాయి.
కంచికచర్ల :
కంచికచర్ల మండలం పరిటాల శివారులోని దొనబండలో 260 హెక్టార్లలో 120 వరకు మెటల్ క్వారీలు ఉన్నాయి. వాటిలో 96 మెటల్ క్వారీలకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని మైనింగ్ శాఖాధికారులు చెబుతున్నారు. వాటి ద్వారా గత ఏడాది రూ.463 లక్షలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. కాని కొండలను పిండి చేసే లైసెన్సు కలిగిన నిపుణులు వేళ్లమీదే ఉన్నారు. ఈ ప్రాంతంలో కొండలకు బాంబులు పెట్టే డీలర్లు మూడు కంపెనీలు మాత్రమే ఉన్నాయి. కొండలను పగులకొట్టే సమయంలో కార్మికులు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. క్వారీ యజమానులు కూడా కార్మికుల భద్రత గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
యజమానుల నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు
క్వారీ యజమానులు బ్లాస్టింగ్‌కు అవసరమైన గోతులు తీసేందుకు, డ్రిల్లింగ్ చేసేందుకు నిష్టాతులైన కార్మికులను నియమించాల్సి ఉంది. దీంతో పాటు వారి ప్రాణరక్షణకు అవసరమైన భద్రత ప్రమాణాలను పాటించాల్సి ఉంది. అయితే మైనింగ్ శాఖాధికారుల నిర్లక్ష్యం, యజమానుల లాభాపేక్ష కారణంగా క్వారీల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి పొట్ట చేతపట్టుకొని వచ్చిన ఇరువురు కార్మికుల ప్రాణాలు శుక్రవారం అనంతవాయువుల్లో కలిసిపోయాయి.
కనిపించని భద్రతా పరికరాలు
బ్లాస్టింగ్ చేసే సమయంలో కార్మికులకు భద్రతా పరికరాలు ఇవ్వకపోవటంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. బ్లాస్టింగ్ చేసే సమయంలో కార్మికుల కాళ్లకు బూట్లు, చేతులకు గ్లౌజులు, నడముకు బెల్టు, ఆక్సిజన్ కిట్స్, సులువైన రహదారి మార్గంతో పాటు పలు సౌకర్యాలు ఏర్పాటుచేయాల్సి ఉంది. ముఖ్యంగా కొండకు బాంబులు పెట్టే సమయంలో నాణ్యమైన రూప్ (తాడు), సమయం గురించి కార్మికులకు పూర్తిగా వివరించాల్సి ఉంటోంది. లేకపోతే బ్లాస్టింగ్ చేసే ప్రాంతంలో ఉంటే కార్మికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది.
పగుళ్లిస్తున్న ఇళ్ల గోడలు, శ్లాబులు
కొండలకు బ్లాస్టింగ్ చేసే సమయంలో క్వారీలకు సమీపంలోని మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్లు కూడా వైబ్రేషన్‌కు గురవుతున్నాయని, దీంతో ఇళ్ల గోడలు పగుళ్లిస్తున్నాయని దొనబండ, పరిటాల గ్రామప్రజలు ఆరోపిస్తున్నారు. ఇంటికి ఏర్పాటు చేసిన కిటికీ అద్దాలు పగిలిపోతున్నాయని, శ్లాబ్ పెచ్చులూడి పోతున్నాయని వాపోతున్నారు. అధికారులకు అనేకసార్లుచెప్పినా పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. క్వారీ యజమానులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ నిపుణులను బ్లాస్టింగ్ సమయంలో ఉపయోగించడంలేదని, ఎటువంటి అనుభవం లేని కార్మికులు బ్లాస్టింగ్ చేస్తుండడంతో అనేక ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయిన చెబుతున్నారు.
భద్రతా పరికరాలు తమ పరిధిలో లేవు
మైనింగ్ శాఖ క్వారీలను లీజుకు ఇవ్వడంతో పాటు వాటి పర్యవేక్షణ తమ చేతుల్లో ఉంటుందని, కార్మికుల భద్రతకు సంబంధించిన విషయాలు మైన్స్ సేఫ్టీ అధికారులు పర్యవేక్షణలో ఉంటుంది. క్వారీ యజమానులు నిపుణులైన కార్మికులకు బ్లాస్టింగ్ పనులు అప్పగించాలి. అవేమీ జరగడం లేదు. అటువంటి వారిపై చర్యలు తీసుకుని క్వారీలను సీజ్ చేస్తాం.
– మైనింగ్ ఏడీ వైఎస్ బాబు