గిరిపుత్రులంటే చులకనెందుకో | minister agency visit | Sakshi
Sakshi News home page

గిరిపుత్రులంటే చులకనెందుకో

Published Fri, Sep 16 2016 10:40 PM | Last Updated on Wed, Aug 29 2018 7:45 PM

గిరిపుత్రులంటే చులకనెందుకో - Sakshi

గిరిపుత్రులంటే చులకనెందుకో

  • మన్యం కష్టాలను ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చేవరకూ కదలికేదీ...?
  • వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి ఆరా తీయడంతో అప్రమత్తత
  • వైఎస్సార్‌ నేతల పర్యటనలతో కళ్లు తెరిచిన టీడీపీ ప్రజాప్రతినిధులు
  •  
    సాక్షిప్రతినిధి–కాకినాడ :
    గిరిపుత్రులంటే ఆమాత్యులకెందుకంత చులకనో. అందునా విలీన మండలాలంటే మరీను. రంపచోడవరం ఏజెన్సీ నియోజకవర్గంలోని నాలుగు విలీన మండలాల్లో 350 పైనే గ్రామాలున్నాయి. ఆ గ్రామాల్లో సుమారు లక్షన్నర మంది గిరిజనులున్నారు. తెలంగాణా నుంచి విడవడి మన జిల్లాలో విలీనమవడమే ఆ మండలాల ప్రజలు చేసిన పాపమా అని ప్రశ్నిస్తున్నారు. వారి ఓట్లతో మనకేంటి పని అనుకున్నారో ఏమో తెలియదు కానీ వారి కష్టాలు, కన్నీళ్లు తుడవాలని జిల్లాలోని ఇద్దరు మంత్రులకు అసలు పట్టనేలేదు.అందుకే ప్రభుత్వం, మంత్రులు, జిల్లా అధికారులు కూడా ఆ మండలాల గిరిజనుల పట్ల సవతితల్లి ప్రేమ ప్రదర్శిస్తున్నారన్న విమర్శలున్నాయి. లేదంటే విలీన మండలాల్లో అంతుచిక్కని వ్యాధితో నలుగురు గిరిజనులు మృత్యువాత పడి 32 మంది ఆసుపత్రిపాలై గిరిజనం హడలెత్తిపోతున్నప్పటికీ 30 రోజుల తరువాత గానీ గిరిజనసంక్షేమ శాఖా మంత్రి రావెల కిశోర్‌బాబుకు మెలకువ రాలేదు.
    అంతు చిక్కని వ్యాధితో విలీన మండలంలో తొలి మరణం గత నెల 14న నమోదైంది.అనంతరం వరుసగా ముగ్గురు గిరిజనులను ఈ వ్యాధి పొట్టనపెట్టుకు ంది. అలా 20 రోజుల వ్యవధిలో నలుగురు మృత్యువాతపడినప్పటికీ బాధిత కుటుంబాలను జిల్లా నుంచి కేబినెట్‌లో కీలకశాఖలు నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బాధిత కుటుంబాలను కనీసం మానవతాదృక్పధంతోనైనా పలకరించిన పాపాన పోలేదు. మొదటి మరణం సంభవించి శుక్రవారానికి నెల రోజులు. నలుగురు మరణించి అంతమంది ఆస్పత్రిపాలయ్యాక 30 రోజుల తరువాత తీరిగ్గా రాష్ట్ర మంత్రి రావెల కిశోర్‌బాబు రంపచోడవరం ఏజెన్సీలో శుక్రవారం పర్యటించారు. కనీసం ఇప్పటికైనా వచ్చారని గిరిజనులు సరిపెట్టుకుంటున్న పరిస్థితి. వచ్చిన మంత్రి కూడా పర్యటనంటే జరిపారు కాని మృతుల కుటుంబాలకు ఏమాత్రం భరోసా ఇవ్వకుండానే తిరుగు ముఖంపట్టారు. మృతి చెందిన నలుగురు కోసం ఎవరిమట్టుకు వారు ఆయా కుటుంబాలు అప్పులు చేసి వైద్యం చేయించారు. ఒకో రోగికి లక్ష నుంచి లక్షన్నర ఖర్చు చేసినా మృతువు నుంచి బయటరాలేకపోయారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వారంతా రెక్కాడితేగాని డొక్కాడని వ్యవసాయ కూలీలే. నెల తరువాత మంత్రి వస్తున్నారంటే ప్రభుత్వం తరఫున ఏదో ఒక సాయం అందుతుందని గిరిజనం గంపెడాశతో ఎదురుచూశారు. ఆర్థికంగా కూడా ప్రకటిస్తారని ఎదురుచూశారు. తీరా మంత్రి రావెల కేవలం మాటలతో సరిపెట్టేసి మృతుల కుటుంబాలకు పైసా కూడా ప్రకటించకుండానే వెళ్లిపోయారు. అక్కడికే పరిమితం కాకుండా మలేరియా మరణాలు లేవని, వ్యాధి తగ్గుముఖం పట్టిందని ఉచిత ప్రకటనలివ్వడం పట్ల కూడా సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. 
     వాస్తవానికి మంత్రి రావెల గురువారమే ఏజెన్సీలో పర్యటనకు రావాల్సి ఉంది. కానీ భద్రతా కారణాలు సాకుగా పర్యటన రద్దయింది. భద్రతా కారణాలతో రద్దు చేసిన మంత్రి పర్యటన భద్రతతో నిమిత్తం లేకుండానే అంత హడావిడిగా 24 గంటల్లో తెల్లవారేసరికి ఎలా వచ్చేయడం అటు అధికారులకు, ఇటు గిరిజనులకు విస్మయాన్ని కలిగించింది. విలీన మండలాల్లో అంతుపట్టని ఈ వ్యాధి, మృతుల విషయాన్ని తెలుసుకున్న వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం రాత్రి వైఎస్‌ఆర్‌సీపీ నేతలను పంపించి వారికి భరోసా కల్పించిన సంగతి తెలిసిందే. అగమేఘాలపై మంత్రి విలీన మండలాల్లో పర్యటనకు రావడానికి ఆ మండలాల్లో మృతుల కుటుంబాల పరిస్థితిని జగన్‌ ఆరా తీయడమే కారణమంటున్నారు. మంత్రి పర్యటించి వెళ్లడం వల్ల ఒరిగేదేమీ ఉండదని మృతుల కుటుంబాలు కోలుకునేలా ఆర్థిక సాయం అందించాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి.
     
    మన్యంలో మలేరియా మరణాలు లేవు
    రంపచోడవరం : 
    తూర్పు మన్యంలో మలేరియా జ్వరాలు గిరిజనులను వణికిస్తూ ప్రాణాలు తీస్తుంటే రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి రావెల కిశోర్‌బాబు మాత్రం మన్యంలో మలేరియా మరణాలు లేవని ప్రకటించడం ఆ ప్రాంతవాసులను ఆశ్ఛర్యపరిచింది. ఏజెన్సీ పర్యటనకు వచ్చిన మంత్రి శుక్రవారం రంపచోడవరం ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. వార్డుల్లో రోగులతో మాట్లాడి వైద్య సేవలు అందుతున్న తీరును తెలుకున్నారు. అనంతరం ఆయన స్దానిక విలేకర్లతో మాట్లాడుతూ  ఏజెన్సీలో మలేరియా ప్రభావం తగ్గిందని, మలేరియాతో మరణించిన దాఖలాలు లేవన్నారు. వీఆర్‌ పురం మండలం అన్నవరానికి చెందిన గిరిజనులు కాకినాడ జీజీహెచ్‌సీలో కాళ్లు వాపు వ్యాధితో చికిత్స పొందుతున్నారని వారిని పరామర్శించినట్లు తెలిపారు. రంచోడవరం ఏరియా ఆసుపత్రిలో అనేక సమస్యలున్నాయని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో ఇద్దరు ప్రత్యేక వైద్య నిపుణులను నియమించగా వారు మూడు నెలల కాలం పనిచేసి వెళ్లిపోయారని, కొత్త వారిని నియమిస్తామన్నారు. ఏరియా ఆస్పత్రిని వంద పడకల స్థాయి ఆసుపత్రిగా మారుస్తామని, బ్లడ్‌ బ్యాంకు, ఐసీయూ యూనిట్‌ ఏర్పాటు చేస్తామన్నారు. వైద్య సేవలు కోసం టీఎస్‌పీ ( ట్రైబుల్‌ సబ్‌ప్లాన్‌ నిధులు)నుంచి రూ. 5 కోట్లు మంజూరు చేస్తామన్నారు. ఐటీడీఏలకు అంబులెన్స్‌ల సదుపాయం కల్పిస్తామని, పోషకాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మందులు కొరత లేదని మంత్రి చెబుతుండగా...‘ మందులు బయట కొనుగోలు చేసుకోవాలని వైద్యులు చెబుతున్నా’రని ఫిర్యాదు చేశారు. మంత్రి వెంట మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు, సబ్‌ కలెక్టర్‌ రవి పట్టాన్‌శెట్టి తదితరులు ఉన్నారు.
     
    ఈ మరణాల మాటేమిటీ?
     
    గిరిజన శాఖా మంత్రి మన్యానికి వస్తున్నారంటే గిరిజనుల్లో ఏదో ఆశ. ఎంతలేదన్నా మన శాఖా మంత్రి కదా ఏదో న్యాయం చేయకపోతారా ... భరోసాగా మాట సాయమైనా ఉండకపోతుందా అని ఆశించిన గిరిజనులకు ‘మహరాజా అంటే మరి రెండు కొరడా దెబ్బలు అదనంగా తగిలిన చందంగా’ తయారైంది. అయితే అధికారుల లెక్కల్లో...వారు రాసుకున్న లెక్కల్లో మాత్రం ఈ మరణాలు సహజ మరణాలుగానో...వేరే వ్యాధి మృతులుగానో నమోదవుతున్నాయి. వారం రోజుల కిందటే దేవీపట్నం మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన పొడియం బన్ని (2) మలేరియాతోనే అసువులు బాసాడు. మంత్రి ప్రకటన నేపధ్యంలో మన్యంలోని ‘సాక్షి’ నెట్‌వర్క్‌ సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి.
    గత ఏడాది కంటే పెరిగిన మలేరియా కేసులు...
    గత ఏడాది కంటే మలేరియా కేసులు సంఖ్య విపరీతంగా పెరిగాయి. ఏజెన్సీ 11 మండలాల్లో 26 పీహెచ్‌సీలున్నాయి.  గత ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 1,85,306 మంది నుంచి రక్త నమునాలు సేకరించగా వీరిలో 3,616 మందికి మలేరియా ఉన్నట్లు నిర్ధారించారు.
    •  ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 2,06,392 మంది నుంచి రక్త నమునాలు సేకరించగా 4,496 మందికి మలేరియా ఉన్నట్టు తేలింది.
    •  మారేడుమిల్లి పీహెచ్‌సీ పరిధిలో  గత ఏడాది  231 మలేరియా కేసులు నమోదుగా ఈ ఏడాది 335 కేసులు నమోదైయ్యాయి.
    • తులసిపాకలల్లో 508 కేసులు నమోదు కాగా ఈ  ఏడాది అదనంగా వంద కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
    •   మంగంపాడు పీహెచ్‌సీలో  440 కేసులు నమోదు కాగా 500కు పైగా నమోదయ్యాయి.
    • విటిదబ్బల పీహెచ్‌సీలో గత ఏడాది 277  కేసులు నమోదు కాగా ఏడాది 439 కేసులు నమోదు చేశారు.
    వాస్తవాలు ఇలా ఉంటే కేసులే లేవు ... మరణాలే లేవు ... అంతా బాగుందని మంత్రి ఎలా చెబుతారని మన్యం ప్రశ్నిస్తోంది.
                                                  
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement