సింగూరు ప్రాజెక్టు వద్ద నీటిని గమనిస్తున్న మంత్రి హరీశ్‌రావు
సింగూరు నీరు చూసి ఆశ్చర్యపోయిన మంత్రి హరీశ్‌రావు
జోగిపేట: సింగూరు ప్రాజెక్టులో నీటి ప్రవాహాన్ని పరిశీలించేందుకు వచ్చిన రాష్ట్రీ నీటి పారుదల శాఖా మంత్రి హరీశ్‌రావు నిండుకుండలా కనిపించిన సింగూరును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బుధవారం మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు బాబూమోహన్, చింతా ప్రభాకర్‌తో కలిసి సింగూరు ప్రాజెక్టును సందర్శించారు.
మంత్రి తన వాహనం దిగుతూనే ప్రాజెక్టు రీడింగ్ ఉండే ప్రదేశంలోని మెట్ల వద్దకు వెళ్లి ఆశ్చర్యపోతూ అలాగే నిలబడి పోయారు. కొన్ని నిమిషాల పాటు దూరంగా ఉన్న నీటిని పరిశీలిస్తూ ఉండిపోయారు. నెల రోజుల కింద వచ్చినప్పుడు ప్రాజెక్టులో నీళ్లే లేవని , ఇప్పుడేమో ఇన్ని నీళ్లు వచ్చాయని, వీటిని చూస్తుంటే ఒక్క బొట్టు కూడా బయటకు పంపకూడదనిపిస్తోందని నవ్వుతూ అన్నారు.
దేవుడు కరుణించడం వల్ల 15 రోజుల్లో ప్రాజెక్టు నిండిపోయిందని నిండిపోవడమే కాకుండా 41 టీఎంసీల నీరు మంజీర నదిలోకి వృధాగా పోయిందని మంత్రి అన్నారు. ప్రాజెక్టులో నీరు ఎండిపోయిన విషయాన్ని ఎమ్మెల్యే బాబూమోహన్ మంత్రి దృష్టికి తీసుకుపోయారు. మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, డిప్యూటీ స్పీకర్‌లు ప్రాజెక్టు వద్ద పూజలు నిర్వహించారు. ప్రాజెక్టును పరిశీలించేందుకు వచ్చిన డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి కూడా నీటిని చూసి అనందం వ్యక్తం చేశారు.