గ్రామాల రూపురేఖలు మార్చేస్తాం: కేటీఆర్
హైదరాబాద్: గ్రామజ్యోతి పథకం ద్వారా గ్రామాల రూపురేఖలు మారుస్తామని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో బుధవారం హైసియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండో సీఎస్‌ఆర్ సమ్మిట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణలోని 8,700 గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. గ్రామాలలో కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 46 వేల చెరువులు ఉన్నాయని.. వాటన్నిటిని మిషన్ కాకతీయ పథకం ద్వారా అభివృద్ధి చేస్తామన్నారు. తమ ప్రభుత్వం విద్యుత్ కొరత లేకుండా చేస్తోందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.15 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నట్లు తెలిపారు.
రాబోయే రెండు మూడేళ్లలో రూ.20వేల కోట్లతో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వెల్లడించారు. రూ.35వేల కోట్లతో మంచి నీటిని ప్రతి ఒక్కరికీ అందించే దిశగా పనులను చేపడుతున్నట్లు తెలిపారు. కృష్ణానది మూడోదశ నవంబర్ 15లోగా పూర్తవుతుందని, గోదావరి నీటిని డిసెంబర్ 15లోగా నగరానికి తీసుకువస్తామని చెప్పారు. హైసియా ఆధ్వర్యంలో సీఎస్‌ఆర్ పథకంలో భాగంగా పలు సామాజిక కార్యక్రమాలు చేయడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో సీఐఐ, ఫిక్కినాస్ డాట్‌కాం వంటి కంపెనీలు పాలుపంచుకున్నాయి. సామాజిక సేవలు చేసినందుకు పలు కంపెనీలకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీ కృష్ణప్రసాద్, ఐటీ కార్యదర్శి జయేశ్‌రంజన్, హైసియా ప్రతినిధులు రమేశ్ లోకనాథన్, భరణి తదితరులు పాల్గొన్నారు.