gramajyoti scheme
-
గ్రామజ్యోతి నిధులిచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి
హైకోర్టులో కార్తీక్‌రెడ్డి పిల్ సాక్షి, హైదరాబాద్: గ్రామజ్యోతి పథకం కింద గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు, సౌకర్యాల కల్పనలో రాష్ట్ర ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి, హైదర్హాకోట్ సర్పంచ్ పి.కృష్ణా రెడ్డి ఈ వ్యాజ్యాన్ని వేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్య దర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. గ్రామజ్యోతి పథకం కింద గ్రామ పంచాయతీలకు నిధులు, సౌకర్యాలను కల్పించా ల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని పిటిషనర్లు తెలిపారు. ఈ పథకం కింద వచ్చే ఐదేళ్లలో రూ.5,375.53 కోట్లు గ్రామ పంచాయతీలకు అందాల్సి ఉన్నా, ఆ నిధులను ప్రభుత్వం విడుదల చేయలేద న్నారు. కనుక ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పంచాయతీలకు నిధులిచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. -
గ్రామాల రూపురేఖలు మార్చేస్తాం: కేటీఆర్
హైదరాబాద్: గ్రామజ్యోతి పథకం ద్వారా గ్రామాల రూపురేఖలు మారుస్తామని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో బుధవారం హైసియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండో సీఎస్ఆర్ సమ్మిట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణలోని 8,700 గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. గ్రామాలలో కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 46 వేల చెరువులు ఉన్నాయని.. వాటన్నిటిని మిషన్ కాకతీయ పథకం ద్వారా అభివృద్ధి చేస్తామన్నారు. తమ ప్రభుత్వం విద్యుత్ కొరత లేకుండా చేస్తోందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.15 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే రెండు మూడేళ్లలో రూ.20వేల కోట్లతో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వెల్లడించారు. రూ.35వేల కోట్లతో మంచి నీటిని ప్రతి ఒక్కరికీ అందించే దిశగా పనులను చేపడుతున్నట్లు తెలిపారు. కృష్ణానది మూడోదశ నవంబర్ 15లోగా పూర్తవుతుందని, గోదావరి నీటిని డిసెంబర్ 15లోగా నగరానికి తీసుకువస్తామని చెప్పారు. హైసియా ఆధ్వర్యంలో సీఎస్ఆర్ పథకంలో భాగంగా పలు సామాజిక కార్యక్రమాలు చేయడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో సీఐఐ, ఫిక్కినాస్ డాట్కాం వంటి కంపెనీలు పాలుపంచుకున్నాయి. సామాజిక సేవలు చేసినందుకు పలు కంపెనీలకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీ కృష్ణప్రసాద్, ఐటీ కార్యదర్శి జయేశ్‌రంజన్, హైసియా ప్రతినిధులు రమేశ్ లోకనాథన్, భరణి తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మహత్యలు పరిష్కారం కాదు
సిరిసిల్ల రూరల్ : సమస్యలకు ఆత్మహత్యలే పరిష్కారం కావని.. ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని కలెక్టర్ నీతూప్రసాద్ సూచించారు. మీకు అండగా నేనున్నాననంటూ సిరిసిల్ల మండలం గ్రామజ్యోతి దత్తత గ్రామం ముష్టిపల్లి, రాజీవ్నగర్వాసులకు భరోసా ఇచ్చారు. గ్రామంలో బుధవారం పర్యటించిన ఆమె నేతన్నల సమస్యలు, ఆత్మహత్య బాధిత కుటుంబాల వెతలు విని చలించిపోయూరు. గ్రామజ్యోతి పథకంలో రాజీవ్‌నగర్, ముష్టిపల్లి గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతానన్నారు. అనర్థాలకు కారణమైన గుడుంబాను పూర్తిస్థాయిలో నిరోధించాలని ఎక్సైజ్, పోలీసుశాఖ అధికారులను ఆదేశించారు. అంత్యోదయ, నివేశన స్థలాలు అర్హులైన వారికీ అందిస్తామన్నారు. డంప్‌యార్డుకు స్థలం కేటాయించి సంపూర్ణ పారిశుధ్య గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇంటికో మరుగుదొడ్డి నిర్మించుకోవాలని సూచించారు. మహిళా సంఘాలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో కమిటీలు వేసి గుడుంబా నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. నేతన్నల సంక్షేమానికి పవర్‌లూం సొసైటీలు, మహిళల ఉపాధి కల్పనకు కుట్టు శిక్షణ కేంద్రం, ఇతర కుటీర పరిశ్రమలు ఏర్పాటుకు ప్రతిపాదిస్తామన్నారు. సర్పంచ్ గొల్లపల్లి బాలాగౌడ్, ఎంపీటీసీ బుర్ర మల్లికార్జున్, జెడ్పీటీసీ పూర్మాణి మంజుల, ఎంపీపీ దడిగెల కమలాబాయి, ఆర్డీవో భిక్షానాయక్, తహశీల్దార్ శంకరయ్య, ఎంపీడీవో మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
నాలుగేళ్లు...రూ.3,121 కోట్లు
గ్రామజ్యోతి కింద జిల్లాకు నిధుల కేటాయింపు - జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలకు నిధుల ప్రతిపాదనలు - అదే స్థాయిలో మండలాలు, గ్రామాలకు కూడా - అత్యధికంగా దేవరకొండకు రూ.378 కోట్లు, అత్యల్పంగా నల్లగొండకు రూ.122 కోట్లు - ఆర్థిక సంఘాల గ్రాంట్లు, ఉపాధి హామీ, రాష్ట్ర ప్రణాళిక నిధులతో కలిపి కేటాయింపులు - ఉపాధి హామీ పథకం నిధులే రూ.2వేల కోట్లు - రాష్ట్రం నుంచి వచ్చేది రూ.512 కోట్లు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి పథకం కింద రానున్న నాలుగేళ్లకు గాను రూ.3,121 కోట్లకు పైగా నిధులు రానున్నాయి. ఈ మేరకు నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల వారీగా నిధుల ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. జనాభా, వెనుకబాటు ప్రాతిపదికన అన్ని స్థాయిల్లో నిధులు కేటాయించారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 30లక్షల వరకు జనాభా ఉండగా, 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరం వరకు ఈ నిధులు కేటాయించారు. ఈ నాలుగేళ్లలో వివిధ పద్దుల కింద గ్రామస్థాయిలో ఇచ్చే నిధుల వివరాలు ఆన్లైన్లో ఉంచారు. ఇందులో 13,14 ఆర్థిక సంఘాల గ్రాంట్లతో పాటు ఎస్ఎఫ్సీ గ్రాంట్లు, తలసరి కేటాయింపు, సీనరేజి గ్రాంటు, వృత్తి పన్ను, గ్రామపంచాయతీల ఆదా యం, ఉపాధి హామీ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక గ్రాంట్లు ఉన్నాయి. దేవరకొండ ఫస్ట్, నల్లగొండ లాస్ట్ నిధుల కేటాయింపునకు సంబంధించి నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే దేవరకొండ నియోజకవర్గానికి అత్యధిక నిధులు కేటాయించారు. ఈ నియోజకవర్గంలో 2.6లక్షల మంది జనాభాకు గాను రూ.378.39 కోట్లు కేటాయించగా, నల్లగొండ నియోజకవర్గంలో 1.26లక్షల మంది జనాభాకు గాను రూ.122.10 కోట్లు కేటాయించారు. మిగిలిన నియోజకవర్గాల విషయానికి వస్తే ఆలేరుకు రూ.252 కోట్లు, భువనగిరికి రూ.168 కోట్లు, హుజూర్‌నగర్‌కు రూ.270 కోట్లు, కోదాడకు రూ.244 కోట్లు, మిర్యాలగూడకు రూ.194 కోట్లు, మునుగోడు నియోజకవర్గానికి రూ.358 కోట్లు, నాగార్జునసాగర్‌కు రూ.273 కోట్లు, నకిరేకల్‌కు రూ.257 కోట్లు, సూర్యాపేటకు రూ.269 కోట్లు, తుంగతుర్తికి రూ.328 కోట్లు నిధులు కేటాయించారు. అయితే 3లక్షలకు పైగా జనాభా ఉన్న నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాలకు దేవరకొండ కన్నా తక్కువ నిధులు కేటాయించారు. ఉపాధి నిధులే అధికం.. గ్రామజ్యోతి పథకం కింద రానున్న నాలుగేళ్లలో కేటాయించిన నిధులను పరిశీలిస్తే ఎక్కువగా ఉపాధి హామీ పథకం కింద నిధులనే చూపెట్టారు. నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు చూపెట్టిన నిధుల్లో 60శాతానికి పైగా నిధులు ఉపాధి హామీ కిందే చూపెట్టారు. జిల్లా వ్యాప్తంగా రానున్న నాలుగేళ్లలో రూ.3120 కోట్లు చూపెడితే అందులో దాదాపు రూ.2వేల కోట్లను ఉపాధి పనుల కింద ఖర్చు పెట్టనున్నట్టు చూపెట్టడం గమనార్హం. ఇప్పటికే కోట్లాది రూపాయలు ఉపాధి హామీ కింద ఖర్చు పెడుతుండగా, మళ్లీ గ్రామజ్యోతి కింద చేపట్టే పనులకు కూడా ఆ నిధులే చూపెట్టడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ పథకం కింద రాష్ట్రం ఇచ్చే నిధులు 20శాతం కన్నా ఎక్కువ లేవు. జిల్లాలో రాష్ట్ర ప్రణాళిక గ్రాంట్ల కింద కేవలం రూ.500 కోట్లు మాత్రమే చూపెట్టారు. ఇక, 13, 14 ఆర్థిక సంఘాల కింద అయితే రూ.450 కోట్ల నిధులున్నాయి. ఇక, గ్రామపంచాయతీలు సమకూర్చుకునే రూ.136 కోట్ల నిధులను గ్రామజ్యోతి కింద వెచ్చించే అవకాశం కల్పించారు. సీనరేజి గ్రాంట్లు, రాష్ట్ర ఆర్థిక కార్పొరేషన్ల నిధులను కూడా గ్రామజ్యోతి కింద ఖర్చు పెట్టేందుకు అనుమతించడం గమనార్హం.