నాలుగేళ్లు...రూ.3,121 కోట్లు
గ్రామజ్యోతి కింద జిల్లాకు నిధుల కేటాయింపు
- జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలకు నిధుల ప్రతిపాదనలు
- అదే స్థాయిలో మండలాలు, గ్రామాలకు కూడా
- అత్యధికంగా దేవరకొండకు రూ.378 కోట్లు, అత్యల్పంగా నల్లగొండకు రూ.122 కోట్లు
- ఆర్థిక సంఘాల గ్రాంట్లు, ఉపాధి హామీ, రాష్ట్ర ప్రణాళిక నిధులతో కలిపి కేటాయింపులు
- ఉపాధి హామీ పథకం నిధులే రూ.2వేల కోట్లు
- రాష్ట్రం నుంచి వచ్చేది రూ.512 కోట్లు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి పథకం కింద రానున్న నాలుగేళ్లకు గాను రూ.3,121 కోట్లకు పైగా నిధులు రానున్నాయి. ఈ మేరకు నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల వారీగా నిధుల ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. జనాభా, వెనుకబాటు ప్రాతిపదికన అన్ని స్థాయిల్లో నిధులు కేటాయించారు.
జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 30లక్షల వరకు జనాభా ఉండగా, 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరం వరకు ఈ నిధులు కేటాయించారు. ఈ నాలుగేళ్లలో వివిధ పద్దుల కింద గ్రామస్థాయిలో ఇచ్చే నిధుల వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచారు. ఇందులో 13,14 ఆర్థిక సంఘాల గ్రాంట్లతో పాటు ఎస్‌ఎఫ్‌సీ గ్రాంట్లు, తలసరి కేటాయింపు, సీనరేజి గ్రాంటు, వృత్తి పన్ను, గ్రామపంచాయతీల ఆదా యం, ఉపాధి హామీ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక గ్రాంట్లు ఉన్నాయి.
దేవరకొండ ఫస్ట్, నల్లగొండ లాస్ట్
నిధుల కేటాయింపునకు సంబంధించి నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే దేవరకొండ నియోజకవర్గానికి అత్యధిక నిధులు కేటాయించారు. ఈ నియోజకవర్గంలో 2.6లక్షల మంది జనాభాకు గాను రూ.378.39 కోట్లు కేటాయించగా, నల్లగొండ నియోజకవర్గంలో 1.26లక్షల మంది జనాభాకు గాను రూ.122.10 కోట్లు కేటాయించారు. మిగిలిన నియోజకవర్గాల విషయానికి వస్తే ఆలేరుకు రూ.252 కోట్లు, భువనగిరికి రూ.168 కోట్లు, హుజూర్‌నగర్‌కు రూ.270 కోట్లు, కోదాడకు రూ.244 కోట్లు, మిర్యాలగూడకు రూ.194 కోట్లు, మునుగోడు నియోజకవర్గానికి రూ.358 కోట్లు, నాగార్జునసాగర్‌కు రూ.273 కోట్లు, నకిరేకల్‌కు రూ.257 కోట్లు, సూర్యాపేటకు రూ.269 కోట్లు, తుంగతుర్తికి రూ.328 కోట్లు నిధులు కేటాయించారు. అయితే 3లక్షలకు పైగా జనాభా ఉన్న నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాలకు దేవరకొండ కన్నా తక్కువ నిధులు కేటాయించారు.
ఉపాధి నిధులే అధికం..
గ్రామజ్యోతి పథకం కింద రానున్న నాలుగేళ్లలో కేటాయించిన నిధులను పరిశీలిస్తే ఎక్కువగా ఉపాధి హామీ పథకం కింద నిధులనే చూపెట్టారు. నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు చూపెట్టిన నిధుల్లో 60శాతానికి పైగా నిధులు ఉపాధి హామీ కిందే చూపెట్టారు. జిల్లా వ్యాప్తంగా రానున్న నాలుగేళ్లలో రూ.3120 కోట్లు చూపెడితే అందులో దాదాపు రూ.2వేల కోట్లను ఉపాధి పనుల కింద ఖర్చు పెట్టనున్నట్టు చూపెట్టడం గమనార్హం. ఇప్పటికే కోట్లాది రూపాయలు ఉపాధి హామీ కింద ఖర్చు పెడుతుండగా, మళ్లీ గ్రామజ్యోతి కింద చేపట్టే పనులకు కూడా ఆ నిధులే చూపెట్టడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ పథకం కింద రాష్ట్రం ఇచ్చే నిధులు 20శాతం కన్నా ఎక్కువ లేవు. జిల్లాలో రాష్ట్ర ప్రణాళిక గ్రాంట్ల కింద కేవలం రూ.500 కోట్లు మాత్రమే చూపెట్టారు. ఇక, 13, 14 ఆర్థిక సంఘాల కింద అయితే రూ.450 కోట్ల నిధులున్నాయి. ఇక, గ్రామపంచాయతీలు సమకూర్చుకునే రూ.136 కోట్ల నిధులను గ్రామజ్యోతి కింద వెచ్చించే అవకాశం కల్పించారు. సీనరేజి గ్రాంట్లు, రాష్ట్ర ఆర్థిక కార్పొరేషన్‌ల నిధులను కూడా గ్రామజ్యోతి కింద ఖర్చు పెట్టేందుకు అనుమతించడం గమనార్హం.