ఆత్మహత్యలు పరిష్కారం కాదు
సిరిసిల్ల రూరల్ : సమస్యలకు ఆత్మహత్యలే పరిష్కారం కావని.. ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని కలెక్టర్ నీతూప్రసాద్ సూచించారు. మీకు అండగా నేనున్నాననంటూ సిరిసిల్ల మండలం గ్రామజ్యోతి దత్తత గ్రామం ముష్టిపల్లి, రాజీవ్‌నగర్‌వాసులకు భరోసా ఇచ్చారు. గ్రామంలో బుధవారం పర్యటించిన ఆమె నేతన్నల సమస్యలు, ఆత్మహత్య బాధిత కుటుంబాల వెతలు విని చలించిపోయూరు. గ్రామజ్యోతి పథకంలో రాజీవ్‌నగర్, ముష్టిపల్లి గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతానన్నారు. అనర్థాలకు కారణమైన గుడుంబాను పూర్తిస్థాయిలో నిరోధించాలని ఎక్సైజ్, పోలీసుశాఖ అధికారులను ఆదేశించారు. అంత్యోదయ, నివేశన స్థలాలు అర్హులైన వారికీ అందిస్తామన్నారు. డంప్‌యార్డుకు స్థలం కేటాయించి సంపూర్ణ పారిశుధ్య గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
ఇంటికో మరుగుదొడ్డి నిర్మించుకోవాలని సూచించారు. మహిళా సంఘాలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో కమిటీలు వేసి గుడుంబా నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. నేతన్నల సంక్షేమానికి పవర్‌లూం సొసైటీలు, మహిళల ఉపాధి కల్పనకు కుట్టు శిక్షణ కేంద్రం, ఇతర కుటీర పరిశ్రమలు ఏర్పాటుకు ప్రతిపాదిస్తామన్నారు. సర్పంచ్ గొల్లపల్లి బాలాగౌడ్, ఎంపీటీసీ బుర్ర మల్లికార్జున్, జెడ్పీటీసీ పూర్మాణి మంజుల, ఎంపీపీ దడిగెల కమలాబాయి, ఆర్డీవో భిక్షానాయక్, తహశీల్దార్ శంకరయ్య, ఎంపీడీవో మదన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.