సీసీ పుటేజీల పరిశీలన చేస్తున్న కలెక్టర్ వివేక్‌యాదవ్
విజయనగరం టౌన్: జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు మరింతగా సేవలందించేందుకు పోలీస్ కమాండ్ కంట్రోల్ ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ వివేక్‌యాదవ్ పేర్కొన్నారు. కలెక్టరేట్ సమీపంలో, పోలీస్ క్వార్టర్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ వెబ్‌సైట్‌ను, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పోలీసు శాఖ సాంకేతిక పరంగా ఎంతగానో ముందుకు వెళ్తుందన్నారు. గతంలో విజయవాడ డీసీపీగా పని చేసిన కాలంలో పోలీస్ వ్యవస్థలో సీసీటీఎన్‌ఎస్, పోలీస్ డ్యాష్‌బోర్డ్, పోలీస్ ఈ రక్షక్, ఈ చలానా ప్రారంభించారని, అదే విధంగా జిల్లా పోలీసు శాఖలో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి, జిల్లా పోలీసులు నిర్వహించే అనేకమైన విధులను, సమాచారాన్ని కంప్యూటరీకరించడంలో ఎస్పీ జి.పాలరాజు విశేష కృషి చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా డేటాబేస్ ఇంటిగ్రేషన్ చాలా ప్రచారంలోకి వచ్చిందన్నారు. ఈ వ్యవస్ధ అందుబాటులో రావడం వల్ల ప్రజలు పోలీసుల సేవలను సులభంగా పొందవచ్చన్నారు. ఐడియల్ పోలీసింగ్ జిల్లా వ్యాప్తంగా అబివృద్ధిపరిచేందుకు చేస్తున్న కృషి అమోఘమన్నారు.
ఎస్పీ పాలరాజు మాట్లాడుతూ కమాండ్ కంట్రోల్‌ను అందుబాటులోకి తీసుకుని రావడం వల్ల పోలీస్ శాఖ 54 సర్వీసులను ప్రజలు సులభంగా పొందవచ్చన్నారు. పోలీసులకు చేసే ఫిర్యాదులు, డయల్ 100 కాల్స్, కోర్టు కేసుల స్థితిని ఎప్పటికప్పుడు ఏ స్థితిలో ఉన్నాయో తెలుసుకోవచ్చన్నారు. అంతేకాకుండా, జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే సీసీ కెమెరాలను ఈ కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేశారన్నారు. సీసీ కెమెరాల ద్వారా అక్కడ జరుగుతున్న దృశ్యాలను లైవ్‌లోనే కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షించవచ్చన్నారు.
జిల్లా వ్యాప్తంగా నేరస్తులు, కేసుల, కోర్టు కేసుల వివరాలు, పాస్‌పోర్టు వెరిఫికేషన్, ఈ చలానులు, ఈ డీఎస్‌ఆర్‌లు అందుబాటులోకి రానున్నాయన్నారు. వృద్ధమిత్ర, మహిళా రక్షక్, దత్తత పాఠశాలలు, పోలీసు శాఖ చేపట్టే అన్ని సామాజిక కార్యక్రమాల వివరాలను ఈ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామన్నారు. ఈ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో ఇక్కడి నుంచి ఎక్కడికైనా అధికారులతో నేరుగా మాట్లాడుకోవచ్చని, కేసుల దర్యాప్తును కమాండ్ కంట్రోల్ నుంచే పర్యవేక్షించవచ్చున్నారు. జిల్లా పోలీసు శాఖ అందించే సిటిజన్ సర్వీసులను పోలీస్ వెబ్‌సైట్ విజయనగరంపోలీస్.ఇన్ పరిశీలించి తెలుసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఓఎస్‌డీ విక్రాంత్ పాటిల్, అదనపు ఎస్పీ అట్టాడ వెంకటరమణ, పార్వతీపురం ఏఎస్పీ దీపికా ఎం.పాటిల్, డీఎస్పీలు, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment