విద్యార్థుల కాలాన్ని నష్టపరిచారు
-
డీఈఓ రామలింగంపై మంత్రి నారాయణ ఆగ్రహం
-
ఫౌండేషన్ కోర్సుల నిర్వహణపై చిత్తూరు, నెల్లూరు జిల్లా అధికారులతో ఫోన్ కాన్ఫరెన్స్
నెల్లూరు, సిటీ:
ఫౌండేషన్ కోర్సులను ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు ప్రయత్నిస్తుంటే, మీరు విద్యార్థుల విలువైన కాలాన్ని నష్టపరుస్తున్నారని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చిత్తూరు, నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో ఫౌండేషన్ కోర్సులు నిర్వహణ ఏవిధంగా ఉందని మువ్వా రామలింగాన్ని మంత్రి ప్రశ్నించారు. మువ్వా మాట్లాడుతూ 10వ తరగతి మినహాయించి కోర్సులు నిర్వహిస్తామని చెప్పారు. దీంతో మంత్రి నారాయణ మువ్వా పై తీవ్రంగా మండిపడ్డారు. ‘నేను చెప్పింది మీరు చేయాలి, మీ సొంత నిర్ణయాలు వద్దు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేడ్‌లు ముఖ్యం కాదని, ఫౌండేషన్ కోర్సులు ద్వారా విద్యార్థులకు ఉపయోగం ఉంటుందన్నారు. నీవు డీఈఓగా వచ్చి రెండు నెలలు గడుస్తుంది, ఈ రెండు నెలలు ఫౌండేషన్ కోర్సులు ప్రారంభించకుండా ఉండడంతో విద్యార్థులు విలువైన కాలాన్ని నష్టపోయారన్నారు.
అనంతరం చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్దిక్ జెయిన్, నెల్లూరు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, చిత్తూరు డీఈఓ నాగేశ్వరరావుతో ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తాను రెండు జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రినని, రెండు జిల్లాల్లో ఫౌండేషన్ కోర్సులు పూర్తి స్థాయిలో నిర్వహించాలన్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి ఫౌండేషన్ కోర్సులు రెండు జిల్లాల్లో ప్రారంభించాలన్నారు. ఈ క్రమంలో చిత్తూరు డీఈఓను ఎంత మంది విద్యార్థులతో కోర్సును మొదలుపెడుతారని మంత్రి ప్రశ్నించారు. చిత్తూరు డీఈఓ మాట్లాడుతూ 3వేల మందితో మొదలుపెడతానని సమాధానం ఇచ్చారు. దీంతో మంత్రి 3వేల మందితో మొదలుపెట్టేందుకు జిల్లా కలెక్టర్, మంత్రి మీతో మాట్లాడాలా అని మండిపడ్డారు. రెండు జిల్లాల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదవే విద్యార్థులు 30శాతం మందితో ఈనెల 14వ తేదీ నుంచి ఫౌండేషన్ కోర్సు నిర్వహించాలన్నారు. ఫౌండేషన్ కోర్సుకు అవసరమయ్యే మెటీరియల్ కూడా సరఫరా చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.