గ్యాంగ్‌స్టర్ మధుతో ‘పల్లె’ దోస్తీ!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం జిల్లాకు చెందిన గ్యాంగ్‌స్టర్ ఎర్లంపల్లి మధు వ్యవహారాలకు మంత్రి పల్లె రఘునాథరెడ్డి అండగా నిలిచారా? మంత్రి మద్దతుతోనే మధు సెటిల్‌మెంట్లు, భూదందాలు నిర్వహించారా? పల్లెతో పాటు మరికొంతమంది టీడీపీ నేతలు అతని అండతో సెటిల్‌మెంట్లు చేశారా? రెండ్రోజులుగా సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్న మధు వీడియో, దాని వెనుక ఉన్న పరిణామాలు బేరీజు వేస్తే అవుననే సమాధానం వస్తోంది. మధు 2014 ఎన్నికలకు ముందు పల్లె రఘునాథరెడ్డి సమక్షంలో టీడీపీ కండువా వేసుకున్నాడు. ఎన్నికల్లో పల్లె విజయానికి కృషి చేశాడు.
పల్లె బెంగళూరుకు వెళితే మధునే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసేవాడని తెలుస్తోంది. పలు సెటిల్‌మెంట్లను కూడా మధుతో పల్లె చేయించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మధు వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండడంతో అతనితో పల్లె రఘునాథరెడ్డి సంబంధాలు, భూదందాలపై జిల్లాలో జోరుగా చర్చ నడుస్తోంది. అనంతపురం జిల్లాలో పల్లెకు వందల ఎకరాల భూము లు ఉన్నాయని, వీటిని గ్యాంగ్‌స్టర్ మధు అండతోనే పంచాయితీలు చేసి కారుచౌక గా కొట్టేశారని పలువురు ఆరోపిస్తున్నారు.
మధును కిడ్నాప్ చేసిన బెంగళూరు రియల్టర్ మంజునాథ్
బెంగళూరుకు చెందిన రియల్టర్ మంజునాథ్‌కు సంబంధించిన రూ.50 కోట్ల భూమి వ్యవహారంలో మధు జోక్యం చేసుకున్నాడు. పక్కకు తప్పుకోవాలని మంజునాథ్ గ్యాంగ్ హెచ్చరించినా వినలేదు. ఈ క్రమంలో కొద్దిరోజుల కిందట మధు వాకింగ్ చేస్తుండగా.. మంజునాథ్ గ్యాంగ్ కిడ్నాప్ చేసి, అజ్ఞాతంలోకి తీసుకెళ్లింది. దుస్తులు ఊడదీసి చితకబాదింది. సెటిల్‌మెంట్లు చేస్తావా? మా విషయంలో జోక్యం చేసుకుంటావా? అని తిడుతూ చావబాదారు. దెబ్బలు తట్టుకోలేక మధు తప్పయిపోయిందని, వదిలిపెట్టాలని, మళ్లీ సెటిల్‌మెంట్ల జోలికి వెళ్లనని విలపించాడు. ఈ దృశ్యాలన్నీ మంజునాథ్ గ్యాంగ్ సెల్‌ఫోన్‌తో చిత్రీకరించి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడవి హల్‌చల్ చేస్తున్నాయి. (చదవండీ: బెంగళూరులో గ్యాంగ్ వార్)