మంత్రి అనుచరులు బస చేసేందుకు అధికారులు సమకూర్చిన పరుపులు, దుప్పట్లు
గుంటూరు : మంత్రి రావెల కిశోర్ బాబు వ్యవహరించిన తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. ‘సంక్షేమాన్ని’ విస్మరించిన మంత్రి తన అనుచరులకు ఏకంగా అమ్మాయిల హాస్టల్లోనే వసతి కల్పించారు. అధికార దర్పంతో విద్యార్థినుల భద్రతను విస్మరించిన ఈ ఘటన గుంటూరులో బుధవారం చోటు చేసుకుంది. స్థానిక పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో నిన్న ప్రభుత్వ దళిత, గిరిజనబాట, మెగా రుణమేళాను ఎస్సీ కార్పొరేషన్ నిర్వహించింది. ఈ కార్యక్రమం కోసం మంత్రి రావెల అనుచరులు వందమందికి పైగా అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల నుంచి గుంటూరు వచ్చారు.
వారందరికీ కలెక్టరేట్ రోడ్డులోని పరివర్తన భవన్‌లో ఆశ్రయం కల్పించారు. ఆ భవన్‌లోనే సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన బాలికల పోస్టుమెట్రిక్ హాస్టల్ నడుస్తోంది. బాలికలు ఉండే చోట మగవారికి ఆశ్రయం కల్పించకూడదని నిబంధనలు చెబుతున్నప్పటికీ తన అనుచరుల కోసం మంత్రి వాటికి తిలోదకాలిచ్చారు. కొంతమంది అధికారులు వారించినా మంత్రి పెడచెవిన పెట్టినట్లు తెలిసింది.