మంత్రి రావెలను తొలగించాల్సిందే | Zilla Parishad chief alleges life threat from Ravela Kishore Babu | Sakshi
Sakshi News home page

మంత్రి రావెలను తొలగించాల్సిందే

Published Sun, Dec 25 2016 12:52 AM | Last Updated on Wed, Aug 29 2018 7:45 PM

మంత్రి రావెలను తొలగించాల్సిందే - Sakshi

మంత్రి రావెలను తొలగించాల్సిందే

మహిళా, దళిత,ప్రజా సంఘాల డిమాండ్‌
గుంటూరు జెడ్పీ చైర్‌పర్సన్‌ జానీమూన్‌కు మద్దతు
ముస్లింల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా
మంత్రి, జెడ్పీ చైర్‌పర్సన్‌ వివాదంపై  విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు


సాక్షి, గుంటూరు/అమరావతి: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ గుంటూరు జిల్లా జెడ్పీ మహిళా చైర్‌పర్సన్‌ జానీమూన్‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించాయి. ఇప్పటికే మంత్రి తన ఇంటిపై పలుమార్లు దాడి చేయించారని, కనీసం గౌరవం ఇవ్వకుండా కక్ష సాధింపునకు దిగుతున్నారని మీడియా సమావేశంలో ఆమె  విలపించడం అందరినీ  కలచివేసింది. తనకు భద్రత పెంచాలని, ఎస్కార్ట్‌ వాహనాన్ని సమకూర్చాలంటూ గుంటూరు అర్బన్, రూరల్‌ జిల్లా ఎస్పీలకు లేఖలు రాశారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్తూ మంత్రి నుంచే అదే పార్టీకి చెందిన మహిళా జెడ్పీ చైర్‌పర్సన్‌కు వేధింపులు ఎదురుకావడం పట్ల మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిని కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశాయి. శనివారం పలు మహిళ, దళిత, ప్రజాసంఘాల నాయకులు జిల్లాపరిషత్‌ కార్యాలయానికి వచ్చి జానీమూన్‌కు మద్దతు పలికారు.ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన మహిళ కావడం వల్లే జానీమూన్‌ను వేధింపులకు గురిచేస్తున్నారని, మంత్రి రావెలను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

వివాదం సద్దుమణిగేలా చూడండి
జెడ్పీ చైర్‌పర్సన్‌ జానీమూన్‌ వ్యవహారంలో ప్రజల్లో చెలరేగుతున్న ఆగ్రహావేశాలను చల్లార్చేందుకు సీఎం చంద్రబాబు  ప్రయత్నాలు ప్రారంభించారు. విచారణకు త్రిసభ్య కమిటీని నియమించారు. గుంటూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా పార్టీ పరిశీలకుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులుతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. మంత్రి రావెల కిషోర్‌బాబు సొంత నియోజకవర్గం ప్రత్తిపాడులోని కాకుమాను మండలం నుంచి జెడ్పీటీసీగా గెలుపొందిన షేక్‌ జానీమూన్‌ను జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా టీడీపీ అధిష్టానం ఎంపిక చేసింది. మొదటి నుంచీ మంత్రి రావెల, చైర్‌పర్సన్‌ల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలి  రావెల తనపై రాళ్లదాడికి పురిగొల్పారని, చంపుతామని బెదిరిస్తున్నారంటూ జానీమూన్‌ చేసిన దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

రాజ్యాంగ పదవుల్లో ఉండి రచ్చ
రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉండి చట్టాన్ని పరిరక్షించాల్సిన టీడీపీ నేతలు రచ్చ రచ్చ చేస్తున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి సమావేశంలో ‘నా సోదరి సమానులైన తెలుగు ఇంటి ఆడపడుచులు’ అని సంబోధిస్తుంటారు. అయితే, వారిపై దాడులు చేసిన, వేధించిన తన పార్టీ నేతలపై మాత్రం ఈగ వాలనివ్వరని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా మంత్రి రావెల వ్యవహారమే ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో వచ్చిన తర్వాత  మహిళలపై వేధింపులు పెరిగిపోయాయి. సాక్షాత్తూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలే మహిళలపై వేధింపులకు దిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

జానీమూన్‌కు మద్దతుగా ర్యాలీ, ధర్నా   
 జెడ్పీ చైర్‌పర్సన్‌ షేక్‌ జానీమూన్‌ను మంత్రి రావెల కిషోర్‌బాబు బెదిరించడం పట్ల ముస్లిం మైనార్టీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. శనివారం ముస్లిం వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నేతలు గుంటూరులోని నగరంపాలెం నుంచి హిమని సెంటర్‌ మహత్మాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. మంత్రి రావెలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రాణహాని ఉండదని స్పష్టమైన హామీ ఇవ్వాలి  
అప్పుడే మంత్రి రావెలతో చర్చలు : షేక్‌ జానీమూన్‌
గుంటూరు(కొరిటెపాడు): రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉండదని స్పష్టమైన హామీతో పాటు గతంలో తాము ప్రతిపాదనలు చేసిన పనులకు ఆమోదం లభించినప్పుడే చర్చలకు సిద్ధమని గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ షేక్‌ జానీమూన్‌ స్పష్టం చేశారు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు శుక్రవారం రాత్రి ఫోన్‌ చేసి, మంత్రి రావెలతో చర్చలకు ఆహ్వానించినట్లు తెలిపారు. జిల్లా పరిషత్‌ ఆవరణలోని తన క్యాంపు కార్యాలయంలో పలు దళిత, మైనారిటీ, ప్రజా సంఘాల నాయకులు, పార్టీ నాయకులు జానీమూన్‌ను శనివారం కలసి సంఘీభావం ప్రకటించారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement