'జానీమూన్ నా కూతురు లాంటిది'
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జానీమూన్, మంత్రి రావెల కిషోర్‌బాబు మధ్య సయోధ్య కుదిరింది. ఈ వివాదంపై చంద్రబాబు నియమించిన త్రిసభ్య కమిటీ ఎదుట జానీమూన్, రావెల ఇద్దరూ హాజరయ్యారు. అనంతరం ఇద్దరూ కలిసి మీడియాతో మాట్లాడారు. తమ ఇంటి మీదకు వచ్చిన రౌడీలు మంత్రికి తెలియకుండానే వచ్చారని, ఈ విషయంలో తానే తొందర పడ్డానని జానీమూన్ అన్నారు. తమ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారన్నారు. మైనారిటీలు తనకు అండగా నిలిచారని, వారందరికీ కృతజ్ఞతలని చెప్పారు.
ఇక జడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్ తనకు కూతురు లాంటిదని, తాను రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో స్థానిక రాజకీయాలను పట్టించుకోలేదని రావెల కిషోర్ బాబు చెప్పారు. వీటిపై తనకు అంతగా అవగాహన లేదని, నియోజకవర్గంలో పర్యటించకపోవడం వల్ల తమ మధ్య అంతరం ఏర్పడిందని అన్నారు. ఐదు నిమిషాలు కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయని తెలిపారు. తనకు తెలియకుండా కొన్ని జరిగి ఉండొచ్చని, అలాంటివి మళ్లీ జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు.