జానీమూన్‌పై తన వైఖరి మార్చుకోని మంత్రి రావెల!
గుంటూరు: గుంటూరు జెడ్పీ ఛైర్‌పర్సన్ జానీమున్‌కు రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు నుంచి బెదిరింపులు కలకలం రేపాయి. టీడీపీ నేత అయినప్పటికీ మహిళా నేతలపై ఇంకా ఇలాంటి ఘటనలు కొనసాగుతున్నాయి. నిన్న (శనివారం) పలు మహిళ, దళిత, ప్రజాసంఘాల నాయకులు జిల్లాపరిషత్ కార్యాలయానికి వచ్చి జానీమూన్‌కు మద్దతు పలికారు. ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన మహిళ కావడం వల్లే జానీమూన్‌ను వేధింపులకు గురిచేస్తున్నారని, మంత్రి రావెలను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేయగా.. మరోవైపు మంత్రి రావెల మాత్రం మహిళానేత జానీమూన్‌కు వ్యతిరేకంగా క్రైస్తవ సంఘాలను రంగంలోకి దించారు. క్రైస్తవ సంఘాలను ఆసరాగా చేసుకుని జానీమూన్‌పైనే ఎదురుదాడికి దిగాలని పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
జానీమూన్ వ్యవహారంలో ప్రజల్లో చెలరేగుతున్న ఆగ్రహావేశాలను చల్లార్చేందుకు విచారణ కోసం సీఎం చంద్రబాబు త్రిసభ్య కమిటీని నియమించారు. గుంటూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా పార్టీ పరిశీలకుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులుతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే మహిళానేతకు న్యాయం చేయకుండా కమిటీల పేరుతో కాలయాపన చేయడాన్ని ప్రజాసంఘాలు తప్పుబట్టాయి. మహిళ అని చూడకుండా జానీమూన్‌ను మంత్రి హోదా వ్యక్తి వేధించడంపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.