కొలువుల కలపై పిడుగుపాటు
-
జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యోగాలకోసం 15 వేల మంది నిరీక్షణ
-
రాష్ట్ర మంత్రి గంటా ప్రకటనతో వారిలో నిరాశానిస్పృహలు
రామచంద్రపురం:
‘జాబు కావాలంటే బాబు రావాలి’.. చంద్రబాబు నాయుడి సారథ్యంలోని టీడీపీ గత ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన నినాదమిది. కానీ గద్దెనెక్కిన తరువాత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు నిరుద్యోగుల్లో నిరాశానిస్పృహలకు కారణమవుతున్నాయి. ఉద్యోగాల్లో ఖాళీలకు నియామకాలు చేపట్టకుండా మెుండిచెయ్యి చూపుతున్నారు. తాజాగా ఉపాధ్యాయుల పోస్టులు ఇక భర్తీ లేనట్లేనని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన ప్రకటన ప్రభుత్వం తీరును, చంద్రబాబునాయుడి హామీలలోని మోసాన్ని బహిర్గతం చేస్తోంది. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులను మంత్రి గంటా ప్రకటన హతాశులను చేసింది. జిల్లాలో సుమారుగా 15 వేల మంది ఉపాధ్యాయ శిక్షణ పొంది, ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారు. ఇప్పుడు వారంతా కంగుతిని ‘బాబు వస్తే జాబు వస్తుం’దని చెప్పిన టీడీపీపై మండిపడుతున్నారు. అటు పోస్టులను భర్తీ చేయకుండా, ఇటు ఉన్న పోస్టులకు ఎసరు పెట్టే నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వ వైఖరిని దుయ్యబడుతున్నారు.
ఏటా 6,500 మంది ఉపాధ్యాయ ఉత్తీర్ణులు
జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మెుత్తం 4,300 వరకు ఉన్నాయి. గత డీఎస్సీ నియామకాలు చేపట్టిన అనంతరం జిల్లాలో 240 స్కూల్ అసిస్టెంటు పోస్టులు, 25 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల ఖాళీలు ఏర్పడ్డాయి. ఇవికాకుండా ఏటా సుమారు 350 మంది వరకు ఉపాధ్యాయులు పదవీ విరమణ చేస్తుంటారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత పదవీ విరమణ వయసును రెండేళ్లు పెంచటంతో పదవీ విరమణ చేసేవారు తక్కువగా ఉంటున్నారు. 2017 నాటికి జిల్లాలో అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయనుండటంతో ఎక్కువగా ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీలు ఏర్పడనున్నాయి. జిల్లాలో సెకండరీ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ కళాశాలలు 59 వరకు ఉన్నాయి. వీటిలో ఏటా సుమారు 5 వేలమంది ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్నారు. ఇక జిల్లాలో ఏటా 1,500 మంది వరకు బీఈడీ అభ్యర్థులు శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 15 వేలమంది ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారున్నారని అంచనా.
ఆది నుంచీ కొలువులకు ఎసరే..
టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఉపాధ్యాయ పోస్టులకు ఎసరు పెడుతూనే ఉంది. గత ఏడాది నుంచి పాఠశాలల రేషనలైజేషన్ పేరుతో జిల్లాలో సుమారుగా 370 పాఠశాలలను విలీనం చేసి ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేశారు. దీంతో ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులను మిగిలిన పాఠశాలలకు సర్దుబాటు చేసి ఉపాధ్యాయ పోస్టులను కుదించేశారు. గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన ప్రభుత్వమే పాఠశాలల విలీనం పేరుతో ఉపాధ్యాయ పోస్టులకు ఎసరు పెట్టింది. దీంతో నిరుద్యోగ ఉపాధ్యాయులకు నిరాశే మిగిలింది. అయినా ఆశతో ఉద్యోగం గురించి ఎదురు చూస్తున్న వారికి మంత్రి ప్రకటన అశనిపాతంలా మారింది.
ఇచ్చిన హామీని నెరవేర్చాలి..
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతీ ఏటా డీఎస్సీని నిర్వహించి పోస్టులు భర్తీ చేస్తామని చంద్రబాబునాయుడు చెప్పారు. కానీ అధికారంలోనికి వచ్చిన తరువాత ఉపాద్యాయ పోస్టుల్లో కోత పెడుతున్నారు. ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
–ఎస్.రేణుకాదేవి, ఎంఎస్సీ, బీఈడీ, రామచంద్రపురం
నిరాశే మిగిలింది..
గతంలో నిర్వహించిన డీఎస్సీని రాసాను, కానీ ఉద్యోగం రాలేదు. ఈ ఏడాది తిరిగి డీఎస్సీ వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నాను, కానీ రాష్ట్ర మంత్రి చేసిన ప్రకటనతో నిరాశే మిగిలింది.
– కుడిపూడి నాగేశ్వరరావు,
బీఎస్సీ, బీఈడీ, రామచంద్రపురం
ఏకగవాక్ష విధానాన్ని తేవాలి..
ప్రభుత్వ నిర్ణయాలతో పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఏక గవాక్ష విధానాన్ని అమలు చేస్తూ ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలి. దీంతో ఏటా శిక్షణ పొందుతున్న వారికి ఉద్యోగాలతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది.
–టీవీవీఎస్ తిలక్‌బాబు, పీఆర్‌టీయూ జిల్లా గౌరవాధ్యక్షుడు