
న్యూఢిల్లీ: ఈ నెల 13వ తేదీన పార్లమెంట్ వద్ద చోటుచేసుకున్న ‘పొగ’ అలజడికి దేశంలో తీవ్రమైన నిరుద్యోగం, పెరుగుతున్న ధరలే కారణమని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఉద్యోగాలు లభించని యువతే లోక్‌సభలో అలజడి సృష్టించిందని చెప్పారు. యువతలో ఎంతో కాలంగా పెరుగుతూ వస్తు న్న ఆగ్రహం ఫలితంగానే ఈ ఘటన చోటు చేసుకుందన్నారు.
‘దేశంలో అత్యంత తీవ్రమైన అంశం నిరుద్యోగం. దేశమంతటా ఈ సమస్య తో యువత రగులుతోంది. మోదీ జీ విధానాల ఫలితంగానే యువతకు ఉద్యోగాలు దొరకడం లేదు’అని ఆయన మీడియాతో అన్నారు. పార్లమెంట్ వద్ద జరిగిన ఘటనకు భద్రతా వైఫల్యమనే కారణమనే విషయం స్పష్టంగానే తెలుస్తోంది. కానీ, దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగమే దీనికి కారణం’అని అనంతరం ఆయన ‘ఎక్స్’లో తెలిపారు.