దుస్తులు మార్చుకునే గదుల లేకపోవడంతో పుష్కర స్నానం అనంతరం ఆరుబైట మహిళల అవస్తలు.. అసంపూర్తిగా వదిలేసిన టాయలెట్
హైదరాబాద్: 'పుష్కరాల నిర్వహణను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాం. తెలుగు రాష్ట్రానికి ప్రపంచ ఖ్యాతి తీసుకొచ్చేలా గోదావరి మహా పుష్కరాలను 2 వేల కోట్ల రూపాయల ఖర్చుతో అత్యంత భారీగా నిర్వహిస్తాం' అని కొద్ది నెలలుగా ప్రభుత్వ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు సహా పలువురు మంత్రులు చెబుతూ వచ్చారు. తీరా పుష్కరాలు ప్రారంభమైన మొదటి గంటలోనే తొక్కిసలాట రూపంలో పెను విషాదం సంభవించి 13 మంది మహిళలు సహా 29 మంది దుర్మరణం చెందడం సర్వత్రా విషాదాన్నినింపింది. అసలీ దుర్ఘటనకు ఏర్పాట్లలో లోపాలే కారణమా? మరి ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం చేసిన ప్రకటనల్లో నిజం ఎంతుంది? అసలు మంత్రులు పుష్కర పనులను పర్యవేక్షించారా? లేక మరేదైనా పనుల్లో బిజీగా గడిపారా? అని ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అన్నీ తానై పుష్కర ఏర్పాట్ల బాధ్యతలను నెత్తికెత్తికున్నానని సీఎం చంద్రబాబు ప్రకటించినా.. పుష్కరాలు జరిగే రెండు జిల్లాల్లో ముగ్గురు మంత్రుల నేతృత్వంలో కమిటీలు వేశారు. ఆయా కమిటీల్లో మరికొందరు మంత్రులకు స్థానం కల్పించారు. దేవాదాయ శాఖ మంత్రిని మాత్రం ఏ కమిటీలోనూ వేయలేదు. పుష్కరాల ప్రారంభానికి ఒక రోజు ముందే ఏర్పాట్లన్నీ పూర్తియాలని ప్రభుత్వం భావించింది. కానీ సదరు మంత్రులు మాత్రం పుష్కర ఏర్పాట్లను పట్టించుకోకుండా ఎంచక్కా విదేశాల్లో చక్కర్లు కొట్టారు.
మంత్రులలో ఇద్దరు తానా సభల్లో అతిథులుగా పాల్గొనేందుకు అమెరికా వెళితే.. మరికొందరు ముఖ్యమంత్రి వెంట జపాన్ లో పర్యటించి వచ్చారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు సదుపాయాల కల్పన సహా ఇతరత్రా ఏర్పాట్లలో పుష్కరాలకు ముందు పదిరోజులు అత్యంత కీలకమైనవి. అలాంటి సమయంలోనే ఏపీ మంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్లడంతో పర్యవేక్షణ కొరవడింది. క్షేత్రస్థాయిలో ఘాట్ల ఏర్పాట్లు, ప్రజలకు అవగాహన కల్పించడం, మంచినీరు, వైద్యసదుపాయాల పర్యవేక్షణ, సిబ్బంది పంపిణీ.. ఇలాంటి విషయాలు వేటినీ ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదు. పుష్కరాలు 14వ తేదీన ప్రారంభం అయితే.. 10వ తేదీ వరకు పర్యటనలలోనే గడిపేశారు. ఇక మిగిలిన మూడు రోజుల్లో ఏమాత్రం చేసి ఉంటారో ఊహించుకోవచ్చు. ఇలాంటి అరకొర ఏర్పాట్ల వల్లే ఇంతటి ఘోరం జరిగిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.