ఎవరై ఉంటారబ్బా ..?
ఎక్కడ చూసినా చర్చోపచర్చలు
అధికారపార్టీ నేతలపైనే అనుమానం
నయీమ్ కేసులో పెదవి విప్పని పోలీస్‌లు
భువనగిరి :
గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్‌కౌంటర్ జరిగి నెలరోజులు కావస్తున్నా కేసులో ఉత్కంఠ వీడడం లేదు. నయీమ్‌తో నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు అధికార పార్టీ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే వారెవరై ఉంటారని జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఆగస్టు నెల 8వ తేదీన గ్యాంగ్‌స్టర్ నయీమ్ మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ వద్దపోలీస్‌ల ఎన్‌కౌంటర్‌లో హతమైన విషయం తెలిసిందే. ఎన్‌కౌంటర్ అనంతరం అతని ఇళ్లలో జరిపిన సోదాల్లో నేర సమాచారంతో కూడిన డైరీ, వందలాది డాక్యుమెంట్లు, బంగారం, ఆభరణాలు, దుస్తులు. చీరలు, కోట్లాది రూపాయల నగదు దొరికిన విషయం తెలిసిందే. నయీమ్ ఎన్‌కౌంటర్‌తో వెలుగు చూసిన పలు కేసులతో స్పందించిన ప్రభుత్వం నయీమ్ కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలని సిట్ దర్యాప్తు సంస్థను నియమించింది. సిట్, స్థానిక పోలీస్‌లు సమన్వయంతో జరిపిన వరుసదాడులతో నయీమ్ అనుచరులను ఊపిరి సలుపుకోనివ్వలేదు. ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేసింది.ముందుగా అతని కుటుంబసభ్యులు, ప్ర«ధాన అనచరులను వెంట వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం ద్వారా బాధితులకు ధైర్యం కలిగించడంతో రాష్ట్ర వ్యాపితంగా అతని అగడాలు ఒక్కోక్కటిగా వెలుగు చూశాయి. సిట్ 62 కేసులు నమోదు చేసింది. మరి కొందరిపై నమోదు చేసి విచారణ జరుపుతోంది.
జిల్లాను కుదిపేసిన ఎన్‌కౌంటర్
గ్యాంగ్‌స్టర్ నయిమ్ స్వస్థలం భువనగిరి కాగా, మిర్యాలగూడ అత్తవారిళ్లు కావడంతో జిల్లాలో అతని నేరసామ్రాజ్యం వేర్లు నలుదిక్కులా విస్తరించిన విషయం వెలుగుచూస్తోంది. అతని నేరసామ్రాజ్యంలో ఉన్నత స్థాయి నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు,రాజకీయ నాయకులు పోలీస్ ఉన్నతాధికారులు, కిందిస్థాయి సిబ్బంది. ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రముఖులు ఉండడం విశేషం. నయీమ్‌తో జిల్లాకు చెందిన అధికారపార్టీ ప్రజాప్రతినిధులకు సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పలుమార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. ఇప్పటికే జిల్లాలో సుమారు 35 మంది వరకు నయీమ్ అనుచరులు,కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి వివిధ కేసుల్లో జైలుకు పంపించారు. ప్రధానంగా నయీమ్ ముఖ్య అనుచరుడు భువనగిరికి చెందిన పాశం శ్రీను, జెడ్పీటీసీ సభ్యుడు సందెల సుధాకర్‌లపై పీడీ యాక్టు నమోదు చేసి వరంగల్‌జైలుకు తరలించగా, భువనగిరి ఎంపీపీ తోటకూర వెంకటేష్‌యాదవ్, మున్సిపల్ కౌన్సిలర్ అబ్దుల్ నాసర్‌లతో పాటు మరో 15 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
మరికొందరిపై కేసులు
నయీమ్ ప్రధాన అనుచరుడు పాశం శ్రీనును పోలీస్‌లు జ్యూడిషియల్ కస్టడీలోకి తీసుకుని మూడు రోజులు విచారించారు. అతను అప్రువర్‌గా మారి నయీమ్‌కు పలువురు ప్రజాప్రతినిధులు,రాజకీయ నాయకులు,పోలీస్ అధికారులు, ఇతర ముఖ్యులకు ఉన్న లింకులను వివరించినట్లు సమాచారం. ఇప్పటికే నయీమ్ డెన్‌లో లభించిన ఫొటోలు, సెల్‌ఫోన్‌సంభాషణల రికార్డులు, డైరీలో లభించిన వివరాలకు పాశం శ్రీను చెప్పిన వివరాలను పోల్చి చూస్తున్న సిట్ అధికారులు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. సిట్‌అధికారులు భువనగిరి, పరిసర ప్రాంత పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేసినట్లుగా మీడియాలో వరుస కథనాలు వస్తున్నా సిట్ అధికారులు, పోలీస్‌లు నోరువిప్పడం లేదు. దీంతో నయీమ్ ఎపిసోడ్‌లో కేసులు నమోదు అయిన నాయకులెవరన్న సస్పెన్స్‌పై జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో జిల్లాలో పలువురు ముఖ్యనేతల నుంచి స్థానిక ప్రజాప్రతినిధుల వరకు ఎవరికి వారు నరాలు తెగె ఉత్కంఠతను అనుభవిస్తున్నారు. పేరున్న నాయకులపై కేసులు నమోదు అయ్యాయని, వారంతా పోలీస్‌లకు చిక్కకుండా అజ్ఞాతంలో ఉన్నారని, కేసుల నుంచి బయటపడడానికి ఉన్నత స్థాయిలో పైరవీలు చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే కేసులు నమోదు అయిన కొందరిని సిట్ పోలీస్‌లు అదుపులోకి అజ్ఞాతంలో విచారిస్తున్నారంటూ ఎక్కడి కక్కడ తీవ్రంగా చర్చించుకుంటున్నారు.అయితే అరెస్ట్ అయిన నాయకులు ఎవరై ఉంటారోనని పలువురు పేరున్న నాయకుల పాత్రపై ఆరా తీస్తున్నారు. నయీమ్ కేసులో ఇప్పటి వరకు అతని కుటుంబ సభ్యులు, ప్రధాన అనుచరులు, స్థానిక ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేసిన సిట్ ఇప్పటి వరకు పేరున్న నాయకుల జోలికి పోలేదు. సీఎం కేసీఆర్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి నయీమ్ కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టబోమని చేస్తున్న హెచ్చరికలు ఎంతవరకు కార్యరూపం దాలుస్తాయో వేచిచూడాల్సి ఉంది.
పదుల సంఖ్యలో ఫిర్యాదులు
నయీమ్, అతని అనుచరులు తమను చంపుతామనిబెదిరించి భూములను,ప్లాట్లను బలవంతంగా లాక్కున్నారని, లక్షలాది రూపాయలు వసూలు చేశారని పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. రెవెన్యూ అధికారులతో పాటు, సిట్ దర్యాప్తు సంస్థకు వస్తున్న ఫిర్యాదులను పరిశీలించి బెదిరింపులకు పాల్పడ్డ వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
వీడని ఉత్కంఠ
Published Thu, Sep 8 2016 12:14 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
Advertisement