అక్రమ కేసులు పెడితే తిరుగుబాటు
- ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని అపహాస్యం చేస్తున్న టీడీపీ నాయకులు
- ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
నాయుడుపేట టౌన్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తీవ్రంగా ఖండించారు. నాయుడుపేటలోని తన నివాసంలో శుక్రవారం ఆయనవిలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ నాయకులు పోలీసులను అడ్డంపెట్టుకుని నైతిక విలువలకు సైతం తిలోదకాలు ఇస్తున్నారని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కామిరెడ్డి సత్య నారాయణ రెడ్డి, దువ్వూరు బాలచంద్రా రెడ్డితో పాటు నాయుడుపేట మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ షేక్ రఫీ, సూళ్లూరుపేట నాయకులు పెమ్మారెడ్డి త్రిలోక్‌చంద్రా రెడ్డిలపై అట్రాసిటీ కేసులతో పాటు పలు సెక్షన్లపై కేసులు పెట్టడం దుర్మార్గపు చర్య అన్నారు.
మహిళా ఎంపీటీసీలను అడ్డం పెట్టుకుని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లలో చొరబడి రౌడీల్లా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరించడం సరికాదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసుకుని అక్రమ కేసులను బనాయిస్తే ఊరుకునేది లేదన్నారు. టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. జిల్లాలో 100కు పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులున్నారని, తమ పార్టీ విజయం తధ్యమన్నారు. ఓడిపోతున్నా మన్న భయంతో టీడీపీ నీతిమాలిన పనులు చేస్తే తాము కూడా ప్రజలతో కలిసి తిరగబడుతామని హెచ్చరించారు.
ఎస్పీని కలిసి అన్ని విషయాలు చెబు తామని, అవసరమైతే జిల్లా నాయకు లతో కలిసి నాయుడుపేట పోలీస్‌స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడ తామని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆల్టిమేటం జారీచేశారు. సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కట్టా సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్లు షేక్ జరీనా, కేఎంవీ కళాచంద్ర, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి మండలాల కన్వీనర్లు తంబిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, మారాబత్తిన సుధాకర్, జరుగుమల్లి బాబురెడ్డి, వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి పాలూరు దశరధరామిరెడ్డి, రైతు విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిందేపల్లి మధుసూధన్‌రెడ్డి, మహిళా జిల్లా కార్యదర్శి కురుగొండ ధనలక్ష్మి, రత్నశ్రీ, నాయకులు పేట చంద్రారెడ్డి, దొంతాల రాజశేఖర్‌రెడ్డి, భీమయ్య, సిద్ధయ్య, పాదర్తి హరినాధ్‌రెడ్డి, మూడు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.