సూరీ.. దాదాగిరి
ధర్మవరంలో దౌర్జన్యకాండ
♦ పొలంలో మొక్కలు నాటుకుంటున్న రైతుపై ఎమ్మెల్యే సూర్యనారాయణ ఆగ్రహం
♦ అనుచరులతో దాడి చేయించిన వైనం
♦ ఘటన చిత్రీకరించిన దళితునిపై దౌర్జన్యం
♦ ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ అరాచకం రాజ్యమేలుతోంది. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను అనవసరంగా వేధించడం.. మాట వినని వారిపై భౌతికదాడులకు దిగడం పరిపాటిగా మారుతోంది. తాజాగా ఎమ్మెల్యే సమక్షంలోనే ఆయన అనుచరులు ఇరువురు రైతులపై పిడిగుద్దులు గుద్దుతూ రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. భౌతిక దాడులను చిత్రీకరిస్తున్న దళితుడిని దుర్భాషలాడుతూ సెల్‌ఫోన్ లాక్కొని ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా...పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. కనీసం ఫిర్యాదు కూడా స్వీకరించలేదు.
ముదిగుబ్బ మండలంలో కోటిరెడ్డి ఆదినారాయణరెడ్డి అనే రైతుకు ప్రభుత్వం 1992లో భూపంపిణీ కింద 2.29 ఎకరాల భూమిని పంపిణీ చేసింది. అప్పటి నుంచి సదరు రైతు తనకిచ్చిన పొలంలో పంట సాగు చేసుకుంటున్నాడు. అయితే 2012లో ప్రజా ప్రయోజనార్థం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ స్టేషన్ నిర్మాణానికి 50 సెంట్ల స్థలం కేటాయించింది. పోలీస్ స్టేషన్ నిర్మాణానికి తన వంతుగా పరిహారం కూడా తీసుకోకుండా ఆదినారాయణరెడ్డి స్థలాన్ని దానంగా ఇచ్చారు. ఆ స్థలంలో 2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలీస్ స్టేషన్ నిర్మించారు. స్థలదాతను హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఘనంగా సన్మానించారు కూడా.
టీడీపీది కక్ష సాధింపు ధోరణి
రైతు ఆదినారాయణ రెడ్డి కోడలు కోటిరెడ్డి సుభాషిణి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున మలకవేముల ఎంపీటీసీ సభ్యులుగా గెలుపొందారు. దీంతో టీడీపీ నాయకులు రైతు కుటుంబంపై కక్ష పెంచుకున్నారు. నెల రోజుల కిందట పోలీస్‌స్టేషన్ నిర్మాణానికి పోగా మిగిలిన 1.79 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పాలని రెవెన్యూ అధికారుల ద్వారా స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చారు. రెవెన్యూ అధికారులు సైతం రైతుకు కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ఆ స్థలంలో పోలీస్ క్వార్టర్స్ నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపారు. ఇందుకు బాధిత రైతు ఆదినారాయణరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీంతో కోర్టు రెవెన్యూ అధికారుల ప్రతిపాదనపై స్టే ఇచ్చింది.
రైతులపై దాడి
ఈ నేపథ్యంలో ఆదినారాయణరెడ్డి కుమారుడు కోటిరెడ్డి కోటేశ్వర్‌రెడ్డి, కూలీ సుదర్శన్‌లు ఆదివారం పొలంలో గంగరేణి మొక్కలు నాటుతుండగా... ఆగ్రహించిన ఎమ్మెల్యే సూర్యనారాయణ తన అనుచరులు 20 మందితో అక్కడి వెళ్లారు. ఎమ్మెల్యే సమక్షంలోనే ఆయన అనుచరులు కనీసం మాట కూడా మాట్లాడకుండానే కోటిరెడ్డి కోటేశ్వర్‌రెడ్డిపై భౌతిక దాడికి దిగారు. పిడిగుద్దులు గుద్దారు. ‘ఎందుకు సార్ కొడుతున్నారు.. మా పొలంలో మేము వ్యవసాయం చేసుకుంటే ఎందుకు ఆపుతున్నారు.. గతంలో మేము పైసా ఆశించకుండా పోలీస్ స్టేషన్‌కు స్థలాన్ని ఇచ్చాము.. ఉండే ఆ కాస్త పొలం పోతే మేము ఎలా బతకాలి’ అని వేడుకున్నా వారు వినిపించుకోలేదు.
ఎమ్మెల్యే మనసు కరగలేదు. ‘ఏం..రా.. మాకే ఎదురు చెబుతావా..? ’ అంటూ దాడి చేసినట్లు బాధితులు వాపోయారు. ఈ దాడి ఘటనను అక్కడే పని చేస్తున్న కూలీ సుదర్శన్ సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుండగా ఎమ్మెల్యే అనుచరులు సెల్‌ఫోన్ లాక్కొని, ధ్వంసం చేశారని బాధితులు తెలిపారు. జరిగిన అన్యాయంపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా పోలీసులు పట్టించుకోలేదని, ఫిర్యాదు స్వీకరించలేదని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.