ప్రచారానికి తెర
9న పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు
15న ఓట్ల లెక్కింపు ప్రచారం వేగవంతం చేసిన అభ్యర్థులు
చిత్తూరు (కలెక్టరేట్): పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచరానికి నేటితో తెరపడనుంది. ఈ నెల 9వ తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. 15న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రచారానికి ఒక్కరోజు మాత్రమే సమయం ఉండడంతో అభ్యర్థులు గెలుపుకోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
రాయలసీమ తూర్పు విభాగంలోని చిత్తూరు, పొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నియోజకవర్గ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మొత్తం 23 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో పట్టభద్రుల స్థానానికి 14 మంది, ఉపాధ్యాయుల స్థానానికి 9 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు 7వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రచారం పూర్తిగా నిలిపివేయాలి. ఆ తరువాత ప్రలోభాలకు గురిచేయడం, సెల్‌లకు మెసేజ్‌లు పెట్టడం, మీడియా ద్వారా ప్రచారం చేయడం లాంటివి చేయకూడదు.
అమీతుమీకి సిద్ధం..
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారానికి ఒక్కరోజు మాత్రమే సమయం ఉన్నందున ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రధాన పోటీ దారులుగా ఉన్న పీడీఎఫ్ (ప్రొగెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్), టీడీపీ అభ్యర్థులు ప్రతి ఓటరును కలసి ప్రచారం నిర్వహించేలా తమ అనుచర గణాన్ని పురమాయిస్తున్నారు. ఇక స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ ప్రచారాన్ని వేగవంతం చేశారు.