సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు పెట్టిన ప్రతీ పైసాకు ఫలితం దక్కేలా జాగ్రత్త వహిస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఓటర్ల వద్దకు వెళ్లి ప్రచారం చేయాలని స్థానిక నాయకులు, కార్యకర్తలను పురమాయిస్తున్నారు. కొందరు ప్రచారం చేయకున్నా చేసినట్టు చెబుతూ అభ్యర్థుల జేబులకు చిల్లు పెడుతున్నారు. వీటిని నివారించేందుకు ‘ఫొటో పంపు, పైసలు తీసుకో’ అనే పద్ధతి అనుసరిస్తున్నారు.
ప్రతిరోజూ ఎంతమంది వచ్చారో, ఫొటోలు, వీడియోలు తీసి వాట్సాప్ చేయాలనే నిబంధన విధిస్తున్నారు. వీటిని పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నారు. ఉదాహరణకు ఓ వాడలో వంద మంది ప్రచారం నిర్వహించామని సంబంధిత ఇన్‌చార్జ్ చెబితే ఆ వంద మంది తప్పనిసరిగా ఫొటో, వీడియోల్లో కనిపించాలి.
ఒకవేళ తక్కువ మంది కనిపిస్తే ఆ మేర డబ్బులు ఇవ్వడం లేదు. ఇక బైక్ ర్యాలీలు, ఆటోలు, ప్రచార రథాలు గ్రామాలు, పట్టణాల్లో తిరిగే సమయంలో మీటర్ రీడింగ్‌లను ఫొటో తీసి పంపి, రాత్రి వరకు ఎన్ని కిలోమీటర్లు తిరిగి ప్రచారం చేశారో లేదో చెక్ చేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక ఎన్నికల్లో తీసుకున్న డబ్బుల ప్రకారం తప్పనిసరిగా పనిచేయాలి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment