
ఊహాజనిత వార్తలతో తప్పుడు సంకేతాలు
తాను వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానంటూ మీడియాలో వచ్చిన కథనాలను ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఖండించారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి స్పష్టీకరణ
విజయనగరం మున్సిపాలిటీ: తాను వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానంటూ మీడియాలో వచ్చిన కథనాలను ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ఖండించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజుతోపాటు కలసి ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. తన రాజీనామా వార్తలపై ఎటువంటి నిర్ధారణ లేకుండా మీడియా కథనాలు ప్రచురించటం బాధాకరమన్నారు.
తాను వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేయట్లేదని, అదే సమయంలో టీడీపీలో చేరేదీ లేదని తేల్చిచెప్పారు. ఇలాంటి వార్తలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అంటూ.. ఊహాజనిత వార్తలు రాయొద్దని మీడియాను కోరారు. ఇప్పటికే అధికార తెలుగుదేశం పార్టీ విపక్ష నేతలను, ప్రజాప్రతినిధులను ప్రలోభపెట్టి ఆకర్షించే విధంగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో నిజం తెలుసుకుని వార్తలు రాయాలని సూచించారు.