చలో మనీ
చలో మనీ
Published Sun, Nov 27 2016 1:49 AM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM
రాజమహేంద్రవరం కేంద్రంగా పెద్దనోట్ల మార్పిడి వ్యాపారం
30 శాతం కమీషన్లు ఇస్తామంటూ బేరసారాలు
ఇతర రాష్ట్రాలS నుంచి వస్తున్న నల్ల కుబేరులు
ఏటీఎంలో నగదు నింపే సిబ్బందే సూత్రధారులు
బ్యాంకు అధికారుల పాత్రపైనా పోలీసుల అనుమానం
రైలులో దొరికిన ఓ ఆసామి టీటీలకు రూ.లక్ష రూ.2 వేల నోట్లు ఇచ్చిన వైనం
అదేమిటంటే సరిపోదా అంటూ మరో లక్ష కట్ట విసిరిన నిందితుడు
రెండు రోజుల కిందట సామర్లకోట రైల్వే స్టేషన్లో రూ.15 లక్షల 2 వేల నోట్లతో ఒకరు
శనివారం రూ.50 లక్షల రూ.1000 నోట్లతో రాజమహేంద్రవరంలో మరొకరు
సాక్షి, రాజమహేంద్రవరం / సామర్లకోట : రోజువారీ అవసరాలకు కూడా నగదు లేక సామాన్య, మధ్య తరగతి ప్రజలు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ రోజుల తరబడి వేచి చూస్తున్నా నాలుగు వేలు కూడా లభించడం లేదు. అలాంటిది కొందరు బ్యాంకు అధికారులు, ఏటీఎంలలో నగదు నింపే సంస్థ సిబ్బంది కమీషన్ వ్యాపారులతో కుమ్మక్కై నగదును బయటికి తరలించేస్తున్నారు. ఏటీఎంలలో ‘సైంటిఫిక్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్’ అనే సంస్థ నగదును నింపుతుంటుంది. ఈ కంపెనీకి చెందిన మేనేజర్ దాసరి శ్రీనివాసు జిల్లాలోని ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపే సమయంలో తన అనుచరుల ద్వారా కొంత నగదును పక్కదారి మళ్లిస్తున్న ఘటన ఇటీవల బయటపడింది, ఇటీవల దాసరి శ్రీనివాసు సామర్లకోటలో టికెట్ లేకుండా రైల్వే ఏసీ బోగీలో ఎక్కారు. జీఆర్పీ పోలీసులు ప్రశ్నించగా వారిపై లక్ష రూపాయల రూ.2000 నోట్ల కట్టను విసిరేశాడు. ఇదేమిటని ప్రశ్నిస్తుండగానే మరో కట్టను విసిరాడు. అతని ప్రవర్తనపై అనుమానం రావడంతో జీఆర్పీ పోలీసులు తనిఖీ చేయగా రూ.15 లక్షలు దొరికాయి. అవన్నీ రూ.రెండు వేల నోట్లు. జీఆర్పీ పోలీసులు అతన్ని విశాఖ పోలీసులకు అప్పగించగా వారు తమదైన శైలిలో విచారించడంతో రాష్ట్ర వ్యాప్తంగా రూ.కోటి విలువైన రూ.రెండువేల నోట్లు దారిమళ్లించినట్లు ఒప్పకున్నాడు. తాజాగా శనివారం రాజమహేద్రవరం రైల్వే స్టేషన్లలో చెన్నైకు చెందిన మది అలిగన్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో జీఆర్పీ పోలీసులు విచారించారు. అతని వద్ద రూ.50 లక్షల విలువైన రూ.1000 నోట్లు లభించాయి. పోలీసులు అతన్ని విచారిస్తున్నారు.
జోరుగా కమీషన్ వ్యాపారం...
జిల్లాలో రాజమహేద్రవరం కేంద్రంగా పెద్దనోట్ల మార్పిడి కమీషన్ వ్యాపారం జరుగుతోందన్న ప్రచారం పక్షం రోజులుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో దాసరి శ్రీనివాసు వ్యవహారం, శనివారం రాజమహేద్రవరం రైల్వే స్టేషన్ లో రూ.50 లక్షల పెద్దనోట్లతో తమిళనాడుకు చెందిన వ్యక్తి పట్టుబడడంతో ఆరోపణలు బలపడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో వ్యాపారం, వైద్యంపరంగా రాజమహేంద్రవరం ముఖ్య కేంద్రంగా బాసిల్లుతోంది. నగరంలో కొందరు ప్రముఖులు, రాజకీయ నేతలు పెద్దనోట్ల మార్పిడిని వ్యాపారంగా మలుచుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డిమాండ్‌ను బట్టి 30 నుంచి 40 శాతం కమీషన్ తీసుకుంటున్నారని సమాచారం. బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే 30 శాతం పన్ను దానిపై 200 శాతం జరిమానాతో రూ.లక్షకు రూ.10 వేలు కూడా రాదు.40 శాతం కమీషన్ పోయినా రూ.లక్షకు రూ.60 వేలు మిగులుతాయన్న ఆలోచనతో చాలా మంది నోట్లను మార్చుకునేందుకు వీరిని ఆశ్రయిస్తున్నారు. ఓ రాజకీయ నేత ఈ కమీషన్ వ్యాపారంలో తనమునకలై ఉన్నారన్న ఆరోపణలున్నాయి. ఈ మధ్య ఓ వైద్యుడు తన వద్ద ఉన్న రూ. 50 లక్షలు మార్చుకునేందుకు ప్రయత్నించగా కమీషన్ ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతానికి ఆగినట్లు సమాచారం.
బ్యాంకు అధికారులపై పోలీసులు నిఘా..
ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపుతున్నా ఆ వివరాలు ఎప్పటికప్పడు సంబంధిత బ్యాంకు అధికారులకు తెలుస్తుంటుంది. బ్యాంకు అధికారులు పాత్ర లేకుండా ఏటీఎంలలో నగదు నింపే సంస్థ సిబ్బంది నగదును దారి మళ్లించలేరని పోలీసులు భావిస్తున్నారు. రూ.450 కోట్లు పక్కదారి పట్టినట్లు శుక్రవారం ఆర్బీఐ ఫిర్యాదు చేయడంతో సీబీఐ ఇటువైపు దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో జిల్లాలో కమీషన్ వ్యాపారం జోరందుకోవడంతో పోలీసులు బ్యాంకు అధికారుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఆయా బ్యాంకుల అధికారులు, సిబ్బంది కదలికలపైనా పోలీసు శాఖ నిఘా పెట్టింది.
Advertisement