ఆరో రోజూ అవే అవస్థలు
-
క్యూ లైన్లలో సామాన్యులు
-
ఉదయం నుంచే ఏటీఎంల వద్ద పడిగాపులు
-
నల్లధనం మార్పునకు పేదలే పావులు
సాక్షి, రాజమహేంద్రవరం :
వారం రోజులు గడుస్తున్నా బ్యాంకుల వద్ద రద్దీ ఏమాత్రం తగ్గడంలేదు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ. వెయ్యి, రూ.500 నోట్లు మార్చుకునేందుకు, నగదు డిపాజిట్ చేసేం దుకు బ్యాంకుల వద్ద ప్రజలు బారులుదీరుతున్నారు. చంటి బిడ్డలతో క్యూలైన్లలో నిలబడలేక అల్లాడిపోతున్నారు. ఉదయం వచ్చిన వారు నగదు మార్చుకునే సరికి సాయంత్రం అవుతోంది. మధ్యాహ్నం భోజనం మానుకుని క్యూలైన్లలో నిలబడుతున్నారు. ఎక్కడ పక్కకు వెళితే తమ స్థానం పోతుందోననే భయంతో అక్కడే ఉండి పోతున్నారు. నల్లధనం బయటకు వస్తుందో రాదో తెలియదుకాని తమ రోజువారీ ఉపాధిని మానుకొని నగదులేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. గం టల తరబడి నిలబడితే రూ.4500 ఇస్తున్నారని, ఇవి తీసుకున్నా చిల్లర కోసం మళ్లీ తిప్పలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తంలో కూడా సామాన్య, మధ్య తరగతి ప్రజలు జమచేసిందే కావడం గమనార్హం. పార్లమెంట్ సమావేశాలు కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ పెద్దనోట్ల చెలామణి రద్దు, పన్ను చెల్లిపుంపులపై ఏదైనా ఉపసమనం లభిస్తుందేమోనన్న ఆశాభావంతో ఉన్నారు.
ఉదయం నుంచే ఏటీఎంల ముందు బారులు
పెద్దనోట్లు చెలామణి లేకపోవడం..చేతిలో ఉన్న రెండు వేల నోటుతో చిన్నపాటి అవసరాలు తీర్చుకునే అవకాశం లేకపోవడంతో ప్రజలు ఏటీఎంల వద్ద క్యూలు కడుతున్నారు.జిల్లాలో ఉన్న 811 ఏటీఎంలలో కేవలం 30 శాతం ఏటీఎంలలో మాత్రమే సిబ్బంది నగదు పెడుతున్నారు. దీంతో ప్రజలు రూ.100 నోట్ల కోసం ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బ్యాంకుల వద్ద ఉన్న ఏటీఎంలలో మాత్రమే నగదు అందుబాటులో ఉంచుతున్నారన్న సమాచారంతో ఆ వైపు పరుగులు తీస్తున్నారు.
పేదలతో నగదు మార్చుతున్న పెద్దలు
కొందరు రాజకీయ నేతలు తమ అనుచరులను ఉపయోగించి పేదల ద్వారా నగదు మార్చుతున్నారు. ఖాతా లేకపోయినా ఆధార్ కార్డు నకలు, బ్యాంకు ఫారం నింపి ప్రతి వ్యక్తి రూ.4500 విలువైన పెద్దనోట్లు మార్చుకునే వెలుసుబాటు ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్న నేతలు నగదు మార్చి ఇచ్చిన వారికి 10 శాతం కమిష¯ŒS ఇస్తున్నారు. నేతల అనుచరలు తమ వెంట తిరిగే కుర్రాళ్లకు నగదు ఇచ్చి మహిళలతో బ్యాంకుల వద్దకు పంపిస్తున్నారు. వారు ఎనాగ్జర్–5 ఫారం నింపి ప్రతి ఒక్కరికీ రూ.4,500 చొప్పున ఇస్తున్నారు. నగదు మార్చిన తర్వాత అక్కడే తిరిగి తీసుకుంటున్నారు. ఈ విధంగా జిల్లాలో ఫైనా¯Œ్స వ్యాపారం నిర్వహిస్తున్న ఓ ప్రజా ప్రతినిధి తన వద్ద ఉన్న నగదు మొత్తాన్ని మార్చుకుంటున్నట్లు సమాచారం.
ఉన్నోళ్లు లేనోళ్లు ఒకటేనా
చేతిలో నగదు లేదు. పెద్దనోట్లు తీసుకోవడంలేదు. నగదు మార్చుకోవడానికి వచ్చాం. ఇంటి దగ్గర ఎవ్వరూ లేకపోవడంతో బాబును కూడా తీసుకొచ్చాను. నల్లధనం బయటకు తీయడానికి నోట్ల రద్దు అని చెబుతున్నారు. ఉన్నోళ్లు లేనోళ్లు ఒకటేనా?. మాకు మాత్రమే ఎందుకు ఈ కష్టాలు.
– డి.ధనమ్మ, రాజమహేంద్రవరం
అనుమతి తీసుకుని వచ్చా
మాది గుంటూరు. హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాను. డబ్బులు అయిపోయాయి. ప్రిన్సిపాల్ అనుమతి తీసుకుని వచ్చాను. నిన్న మధ్యాహ్నం వచ్చి క్యూలో నిలబడ్డాను. గంట తర్వాత ఏటీఎంలో నగదు అయిపోయింది. తిరిగి ఈ రోజు వచ్చాను. క్లాసులు పోతున్నా తప్పడంలేదు.
– వి.పావని, బీఎస్సీ