విజయవాడ సిటీ : అంతర్ జిల్లా మోస్ట్ వాంటెడ్ గజదొంగ దున్న కృష్ణను విజయవాడ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు చోరీ సొత్తు విక్రయించేందుకు సహకరించిన కోల్‌కతాకు చెందిన మహ్మద్ షబీర్ ఆలీ నయ్యాను అరెస్టు చేసి రూ.80 లక్షల విలువైన 2.5 కిలోల బంగారం, 15 కిలోల వెండి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం కమిషనరేట్‌లో శాంతిభద్రతల విభాగం డీసీపీ ఎల్.కాళిదాస్ ఈ వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా మిలియాకుట్టి మండలం చాప్రా గ్రామానికి చెందిన దున్న కృష్ణ బతుకుదెరువు కోసం కుటుంబం సహా విశాఖపట్నానికి వలస వెళ్లాడు.
అక్కడ వెల్డర్‌గా జీవితం ప్రారంభించి వచ్చిన సంపాదన చాలకపోవడంతో 1995 నుంచి చోరీలను వృత్తిగా ఎంచుకున్నాడు. ప్రారంభంలో విశాఖపట్నం, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో చోరీలు చేశాడు. ఆయా జిల్లాల్లో 150కి పైగా కేసులు నమోదు కావడంతో పలుమార్లు పోలీసులు అరెస్టు చేసి విశాఖ జిల్లా కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌లో డీసీ షీటు తెరిచారు. 2011 నుంచి కోల్‌కతాకు మకాం మార్చిన దున్న కృష్ణ తరచూ ఇక్కడికి రాకపోకలు సాగిస్తూ చోరీలు చేయడం ప్రారంభించాడు. ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లాలో 4, రాజమండ్రిలో 9, ఏలూరులో ఒక చోరీతో పాటు విజయవాడ కమిషనరేట్ పరిధిలో 68 భారీ చోరీలు చేశాడు.
ఆయా చోరీల్లో కొల్లగొట్టిన సొత్తును కోల్‌కతాకు చెందిన ఆలీ నయ్యా ద్వారా విక్రయించి సొమ్ము చేసుకుంటూ వచ్చిన మొత్తాన్ని జల్సాలకు వినియోగించుకుంటున్నాడు. గత కొంతకాలంగా జరిగిన భారీ చోరీలపై నగర పోలీసు కమిషనర్ డి.గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు సీసీఎస్ పోలీసులు దున్న కృష్ణపై నిఘా పెట్టారు. అతను నగరంలో తిరుగుతున్నట్టు వచ్చిన సమాచారం మేరకు పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో కాపు కాసి అదుపులోకి తీసుకోవడంతో పాటు సహకరించిన వ్యక్తిని అరెస్టు చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ కాళిదాస్ తెలిపారు.
మోస్ట్‌వాంటెడ్ గజదొంగ అరెస్ట్
Published Fri, Oct 30 2015 10:12 PM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM
Advertisement