ఆదిలాబాద్: కూతురును అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిందిపోయి.. ఆ కన్నతల్లి కర్కశత్వానికి ఒడిగట్టింది. 9 నెలల పసికందు అని కూడా చూడకుండా నిర్ధాక్షిణ్యంగా చిదిమేసింది. ఈ సంఘటనలో తల్లికి జీవితఖైదు విధిస్తూ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఉదయగౌరి శుక్రవారం సంచలన తీర్పు వెల్లడించారు. ముథోల్ మండలంలోని వడ్తాల్ గ్రామానికి చెందిన అల్మోల్ల రాణి 2015 అక్టోబర్ 15న తన 9 నెలల కూతురు శివానిని గొంతు నులిమి హత్య చేసింది.
అయితే తాను ఇంట్లో లేని సమయంలో భర్తే చంపాడంటూ ముథోల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పటి ముథోల్ సీఐ గణపతిజాదవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తానే కూతురును చంపి కేసును భర్త లక్ష్మణ్‌పైకి నెట్టినట్లు దర్యాప్తులో ఒప్పుకుంది. దీంతో రాణిని అరెస్టు చేశారు. శుక్రవారం కోర్టులో హాజరుపర్చగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ 13 మంది సాక్షులను ప్రవేశపెట్టి విచారించారు. నేరం రుజువు కావడంతో రాణికి జీవితఖైదు, రూ.15 వేల జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి తీర్పు వెల్లడించినట్లు కోర్టు లైజన్ అధికారి వెంకట్రావ్ తెలిపారు.
కూతురిని చంపిన తల్లికి జీవితఖైదు
Published Sat, Oct 8 2016 7:17 AM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM
Advertisement