
సినిమాకొచ్చిన నెమలి!
వి.కోట : అసలే ఎండలు మండిపోతున్నాయి. అడవుల్లో కూడా పచ్చదనం కరువైపోతోంది. పిట్టల్లా జనం వేసవి తాపానికి రాలుతున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం అన్నట్టు ఎంచక్కా ఓ నెమలి అడవి నుంచి పట్నం బాట పట్టింది. అలా..అలా..ఎగురుతూ ఓ సినిమా థియేటర్‌పై వాలింది. అప్పటికే ఫస్ట్‌షో మొదలైంది. కొత్త సినిమా కావడంతో ‘గబ్బర్‌సింగ్’ ఫ్యాన్స్ సందడి ఎక్కువగానే ఉంది. బయట నుంచి కొందరు నెమలిని చూసారు. ‘సినిమాకు నెమలొచ్చిందిరోయ్’ అంటూ కేకలు వేసి హడావుడి చేయడంతో అది కాస్తా బెదిరిపోయింది. అక్కడి నుంచి కేబిన్‌రూంలోకి ప్రవేశించింది. ఐదారు నిమిషాలు అటూఇటూ అక్కడే తిరిగిన నెమలి థియేటర్ సిబ్బంది కేబిన్‌లోకి రూంలోకి రావడంతో మళ్లీ బెదిరిపోయింది.
ఈ సినిమాకో దండం సామీ అనే లెవెల్లో గ్రౌండ్ ఫ్లోర్‌లోకి పరుగులు తీసి ఓ రూమ్‌లోకి వెళ్లింది. దీంతో థియేటర్ సిబ్బంది ఆ రూమ్‌కు గడి పెట్టి, అటవీ సిబ్బందికి సమాచారం చేరవేశారు. సినిమాకు శుభం కార్డు పడేవేళకు నెమలి గురించి తెలియడంతో ప్రేక్షకులు సైతం నెమలిని చూసేందుకు ఆసక్తి చూపారు. సెకండ్‌షోకు వచ్చిన వారు ఇది ‘సర్దార్’ ఫ్యాన్ ఏమోనంటూ సరదాగా జోకులేసుకున్నారు. శనివారం రాత్రి ఈ సంఘటన వి.కోటలో చోటుచేసుకుంది. ఇక, ఆదివారం ఉదయం థియేటర్ వద్ద నెమలిని స్వాధీనం చేసుకున్న అటవీ సిబ్బంది మళ్లీ దానిని అటవీ ప్రాంతంలో వదలడం ఆలస్యం.. బతుకుజీవుడా!.. అంటూ మళ్లీ అడవి బాట పట్టింది!