ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంపై సినిమా
స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రపై సినిమా తెరకెక్కనుంది.
ఉయ్యాలవాడ: స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రపై సినిమా తెరకెక్కనుంది. ఆ వీరుడిని గురించి తెలుసుకునేందుకు రూపనగుడి గ్రామానికి వచ్చినట్లు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా కో డైరెక్టర్ రవీంద్రారెడ్డి చెప్పారు. బుధవారం ఆ గ్రామంలోని కర్నాటి నారాయణరెడ్డి కుటుంబాన్ని కలుసుకుని వారితో మాట్లాడారు. నరసింహారెడ్డి వాడిన ఖడ్గాన్ని పరిశీలించారు. నరసింహారెడ్డి పట్టుబడిన గిద్దలూరులోని జగన్నాథ గుట్ట, ఉరితీయబడిన కోవెలకుంట్ల జుర్రేరు, ఆయన పూజలు చేసే దుర్గమ్మ దేవాలయం, పరిసర ప్రాంతాలను సందర్శించనున్నట్లు కోడైరెక్టర్ వెల్లడించారు. ఆయన వెంట ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమాశంకర్, మేనేజర్ మన్మోహన్, కుందూ పోరాట కన్వీనర్ కామిణి వేణుగోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.